IPL 2026: లక్నో దెబ్బకు ఆరో స్థానంలో చెన్నై.. మారిన ప్లేఆఫ్స్ లెక్కలు.. సీఎస్కే పరిస్థితి ఎలా ఉందంటే..?

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు క్లైమాక్స్‌కు చేరుతున్న వేళ చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కీలక పోరులో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో రుతురాజ్ గైక్వాడ్ సేన 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన లక్నో.. చెన్నై ఆశలపై నీళ్లు చల్లడం విశేషం. ప్రస్తుతం ప్లేఆఫ్స్ సమీకరణాలు ఎలా ఉన్నయో తెలుసుకుందాం..

IPL 2026: లక్నో దెబ్బకు ఆరో స్థానంలో చెన్నై.. మారిన ప్లేఆఫ్స్ లెక్కలు.. సీఎస్కే పరిస్థితి ఎలా ఉందంటే..?
Chennai Super Kings Playoff Scenarios

Updated on: May 16, 2026 | 11:07 AM

లక్నోతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అన్ని విభాగాల్లోనూ విఫలమై భారీ ఓటమిని మూటగట్టుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 187 స్కోరు చేసింది. కార్తిక్ శర్మ మెరుపు అర్ధశతకంతో రాణించి జట్టుకు మంచి స్కోరు అందించగా, లక్నో బౌలర్, సీఎస్‌కే పాత ఆటగాడు ఆకాష్ సింగ్ మూడు వికెట్లు తీసి చెన్నైని కట్టడి చేశాడు. ఆ తర్వాత 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు మిచెల్ మార్ష్ చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 38 బంతుల్లోనే 90 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అతనికి తోడుగా జోష్ ఇంగ్లిస్ (36 పరుగులు) రాణించడంతో లక్నో మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

 ప్లేఆఫ్స్ సమీకరణాలు ఇవే

ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్‌తో సమానంగా 12 పాయింట్లు ఉన్నప్పటికీ, నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటం వల్ల చెన్నై ఒక స్థానం కిందకు దిగజారాల్సి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో చెన్నై ప్లేఆఫ్స్ చేరాలంటే సమీకరణాలు ఇలా ఉన్నాయి..

రెండు మ్యాచ్‌లు గెలిస్తే: ఒకవేళ CSK తన మిగిలిన రెండు మ్యాచ్‌లైన సన్‌రైజర్స్, గుజరాత్ టైటాన్స్‌లపై ఖచ్చితంగా గెలిస్తే.. 14 మ్యాచ్‌ల నుండి 16 పాయింట్లు లభిస్తాయి. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆ జట్టుకు టాప్-4 లో నిలవడానికి ఇది సరిపోతుంది. అయితే ఈసారి 5 జట్లకు 16 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు సాధించే అవకాశం ఉన్నందున, రన్ రేట్ ఇక్కడ కీలకం కానుంది.

ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిస్తే: ఒకవేళ మిగిలిన రెండు మ్యాచ్‌లలో చెన్నై ఒక్కటి మాత్రమే గెలిస్తే, వారి ఖాతాలో 14 పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఆ పరిస్థితిలో టాప్-4 లో నిలవడం దాదాపు అసాధ్యం. అప్పుడు పూర్తిగా ఇతర జట్ల గెలుపోటములు, నెట్ రన్ రేట్‌ పైనే ఆధారపడవలసి ఉంటుంది.

టెన్షన్ లేదు: కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్

ఈ ఓటమి, ప్లేఆఫ్స్ ఆందోళనపై సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్ తర్వాత కీలక కామెంట్స్ చేశాడు. ‘‘ప్రస్తుతానికి మా ముందున్న మొదటి సవాలు చెన్నైకి తిరిగి చేరడం. అది చాలా సుదీర్ఘమైన విమాన ప్రయాణం. ఆ తర్వాత రూమ్‌కి వెళ్లి మనం ఎక్కడ తప్పులు చేశాం, ఏయే అంశాలను మెరుగుపరుచుకోవాలి అనేది గుర్తించాలి. ఇక్కడి పరిస్థితులకు వీలైనంత త్వరగా అలవాటుపడాలి. ఇప్పుడు మా ముందరి లెక్క చాలా సులభం. మనం ఎన్ని మ్యాచ్‌లు ఆడినా, ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాలి. కాబట్టి ఇది సులభమే కానీ సంక్లిష్టమైనదేమీ కాదు. వచ్చే మ్యాచ్‌లలో ఎవరు బాగా ఆడితే ఆ రోజును మనకు అనుకూలంగా మార్చుకుంటామని ఆశిస్తున్నాను’’ అని రుతురాజ్ ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన లక్నో సూపర్ జెయింట్స్.. చెన్నై కొంపముంచడం, ఇప్పుడు చెన్నై తన తరువాతి పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడటానికి సిద్ధమవుతోంది. మరి ఈ కీలక పోరులోనైనా చెన్నై పుంజుకుంటుందో లేదో చూడాలి.

Follow Us