
Nigar Sultana : బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా ఈ మధ్య తన ఆట కంటే వివాదాల కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా తనపై వచ్చిన ఆరోపణలకు ఆమె టీమిండియా స్టార్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పేరును ప్రస్తావిస్తూ సమాధానం ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. జూనియర్ ఆటగాళ్లను కొట్టినట్లు తనపై వచ్చిన ఆరోపణలను బంగ్లాదేశ్ కెప్టెన్ ఖండించారు. ఈ సందర్భంగా నిగర్ సుల్తానా చేసిన వ్యాఖ్యలు, అసలు వివాదం ఏమిటో తెలుసుకుందాం.
బంగ్లాదేశ్ జట్టులోని ఫాస్ట్ బౌలర్ జహానారా ఆలమ్, తమ జట్టు జూనియర్ ప్లేయర్‌ను నిగర్ సుల్తానా కొట్టిందని బహిరంగంగా ఆరోపించారు. ఈ ఆరోపణలపై నిగర్ సుల్తానా స్పందిస్తూ.. తాను ఎవరినీ ఎందుకు కొట్టాలంటూ ప్రశ్నించారు. ఆమె తనను తాను సమర్థించుకుంటూ చేసిన వ్యాఖ్యల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ పేరును ప్రస్తావించారు. “నేను ఎవరినైనా ఎందుకు కొట్టాలి? నేను నా స్టంప్స్‌ను ఎందుకు కొట్టుకోవాలి? నేనేమైనా హర్మన్‌ప్రీత్ కౌర్‌నా ? నేను అలా ఎందుకు చేస్తాను?” అని నిగర్ సుల్తానా ప్రశ్నించారు. “నేను ఎవరితోనైనా శారీరకంగా ఎందుకు గొడవపడతాను? మీరు ఏ ప్లేయర్‌ను అడిగినా నేను ఎప్పుడైనా అలాంటి పనులు చేశానో లేదో తెలుస్తుంది” అని ఆమె అన్నారు.
హర్మన్‌ప్రీత్ కౌర్ వివాదం ఏమిటి?
నిగర్ సుల్తానా, హర్మన్‌ప్రీత్ కౌర్ పేరును ప్రస్తావించడానికి కారణం.. 2023 లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఒక మ్యాచ్‌లోని సంఘటన. 2023లో బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా జరిగిన ఒక వన్డే మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఎల్బీడబ్ల్యూ ద్వారా ఔట్ ఇచ్చినప్పుడు ఆమె కోపం తెచ్చుకున్నారు. ఔట్ అయిన వెంటనే హర్మన్‌ప్రీత్ తన బ్యాట్‌తో స్టంప్స్‌ను బలంగా కొట్టారు. అంపైర్‌తో కూడా కోపంగా మాట్లాడారు. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడంతో వన్డే సిరీస్ 1-1తో డ్రా అయ్యింది.
హర్మన్‌ప్రీత్ ఆ తర్వాత బంగ్లాదేశ్ అభిమానులకు అభ్యంతరకరమైన సంజ్ఞ చేయడంతో ఆమెపై రెండు మ్యాచ్‌ల నిషేధం పడింది. నిగర్ సుల్తానా ఇప్పుడు ఆ సంఘటనను ఉద్దేశించే హర్మన్‌ప్రీత్ పేరును ఉపయోగించారు. బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా హర్మన్‌ప్రీత్ కౌర్‌పై విమర్శలు చేసినప్పటికీ, హర్మన్ ప్రీత్ కౌర్ ఇప్పటికే చరిత్ర సృష్టించారు. తన కెప్టెన్సీలోనే భారత మహిళల జట్టు తొలిసారిగా మహిళల వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్, సౌతాఫ్రికా జట్టును ఓడించి ఈ ఘనత సాధించింది. నిగర్ సుల్తానా కామెంట్లు హర్మన్‌ప్రీత్ కౌర్ అప్పటి వివాదాస్పద చర్యను సూచిస్తున్నాయి. అయితే బంగ్లాదేశ్ కెప్టెన్ తనపై వచ్చిన ఆరోపణలను ఎంతవరకు నిజాయితీగా ఖండిస్తున్నారు అనేది ప్రశ్నార్థకం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..