Boxing Day : క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ డే..ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38 కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి ఈ బాక్సింగ్ డే ?

Boxing Day : ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులకు డిసెంబర్ 26 అంటే అదొక పండుగ రోజు. దీనినే బాక్సింగ్ డే అని పిలుస్తారు. క్రిస్మస్ మరుసటి రోజున జరిగే ఈ మ్యాచ్‌లకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ ఏడాది బాక్సింగ్ డే రోజున ఏకంగా 29 క్రికెట్ మ్యాచ్‌లు జరగబోతుండటం విశేషం.

Boxing Day : క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ డే..ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38 కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి ఈ  బాక్సింగ్ డే ?
Boxing Day Cricket

Updated on: Dec 26, 2025 | 7:35 AM

Boxing Day : ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులకు డిసెంబర్ 26 అంటే అదొక పండుగ రోజు. దీనినే బాక్సింగ్ డే అని పిలుస్తారు. క్రిస్మస్ మరుసటి రోజున జరిగే ఈ మ్యాచ్‌లకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ ఏడాది బాక్సింగ్ డే రోజున ఏకంగా 29 క్రికెట్ మ్యాచ్‌లు జరగబోతుండటం విశేషం. కేవలం మ్యాచ్‌లే కాదు, సుమారు 38 కోట్ల రూపాయల భారీ ప్రైజ్ మనీ కలిగిన ఒక లీగ్ కూడా ఈ రోజే ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా గడ్డ నుంచి మన భారత్ దాకా ఈ రోజంతా క్రికెట్ విందు ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం.

అసలు ‘బాక్సింగ్ డే’ అంటే ఏమిటి?

చాలా మంది ఇది బాక్సింగ్ క్రీడకు సంబంధించింది అనుకుంటారు, కానీ అది తప్పు. క్రిస్మస్ (డిసెంబర్ 25) మరుసటి రోజున పేదలకు బహుమతులు (Boxes) ఇచ్చే సంప్రదాయం నుంచి ఈ పేరు వచ్చింది. బ్రిటన్, కామన్వెల్త్ దేశాలైన ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, సౌతాఫ్రికాలో ఈ రోజు పబ్లిక్ హాలిడే. క్రికెట్ ప్రపంచంలో బాక్సింగ్ డే అంటే ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగే టెస్ట్ మ్యాచ్‌ ప్రధాన ఆకర్షణ. ఈసారి అక్కడ ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ (ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్) నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా 3-0తో సిరీస్ గెలిచినప్పటికీ, మెల్‌బోర్న్ మైదానంలో లక్ష మంది ప్రేక్షకుల మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది.

టీమిండియా మహిళల హవా!

ఈ బాక్సింగ్ డే రోజున భారత పురుషుల జట్టుకు మ్యాచ్ లేకపోయినా, మన మహిళా క్రికెటర్లు రంగంలోకి దిగుతున్నారు. తిరువనంతపురంలో భారత్, శ్రీలంక మహిళా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఇండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. క్లీన్ స్వీప్ లక్ష్యంతో హర్మన్‌ప్రీత్ సేన ఈ పవిత్రమైన రోజున మైదానంలోకి అడుగుపెట్టనుంది. మరోవైపు భారత్‌లో జరుగుతున్న డొమెస్టిక్ వన్డే టోర్నమెంట్‌లో కూడా ఏకంగా 19 మ్యాచ్‌లు ఈ రోజే జరగబోతున్నాయి. అంటే దేశంలోని ప్రతి మూల క్రికెట్ సందడి నెలకొనబోతోంది.

38 కోట్ల ప్రైజ్ మనీ.. బిగ్ లీగ్స్ షురూ!

ఈ రోజు మరో రెండు ప్రధాన టీ20 లీగ్‌లు ప్రారంభం కాబోతున్నాయి. సౌతాఫ్రికాలో SA20 లీగ్ మొదలవుతోంది. ఈ లీగ్ మొత్తం ప్రైజ్ మనీ సుమారు రూ.38 కోట్లు! గెలిచిన జట్టుకు రూ.16.5 కోట్లు, రన్నరప్‌కు రూ.8 కోట్లు లభిస్తాయి. మొదటి రోజే ఎంఐ కేప్ టౌన్, డర్బన్ సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. అలాగే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ కూడా ఈ రోజే ప్రారంభమవుతోంది. సిల్హెట్‌లో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇవే కాకుండా ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ డబుల్ హెడర్ మ్యాచ్‌లు, న్యూజిలాండ్‌లో సూపర్ స్మాష్ లీగ్, యూఏఈలో ఐఎల్ టీ20 మ్యాచ్‌లు క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించనున్నాయి.

మొత్తంగా చూస్తే, ఆస్ట్రేలియా యాషెస్ టెస్ట్ నుంచి లోకల్ వన్డేల దాకా బాక్సింగ్ డే రోజున క్రికెట్ స్కోర్లు చూస్తూ అభిమానులు బిజీ అయిపోవడం ఖాయం. ఒకే రోజు ఇన్ని లీగ్‌లు, ఇన్ని రకాల ఫార్మాట్లు జరగడం క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..