
IND vs AUS Result : ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు మరోసారి టీమిండియాను చిత్తు చేసింది. ఈ ఉత్కంఠభరిత పోరులో ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ మెరుపు సెంచరీ (142 పరుగులు) సాయంతో 331 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద సక్సెస్‌ఫుల్ రన్ ఛేజ్ రికార్డు. ఈ విజయంతో ఆస్ట్రేలియా టోర్నీలో తమ మూడో విజయాన్ని నమోదు చేయగా, భారత్‌కు ఇది వరుసగా రెండో ఓటమి.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకోగా, టీమ్ ఇండియా బ్యాటింగ్‌కు దిగింది. గత మూడు మ్యాచ్‌ల్లో ఫామ్ కోల్పోయిన ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతికా రావల్ ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించారు. ఈ ఓపెనింగ్ జోడీ తొలి వికెట్‌కు 25 ఓవర్లలో ఏకంగా 155 పరుగులు జోడించింది. మంధానా 66 బంతుల్లో 80 పరుగులు, ప్రతికా రావల్ 75 పరుగులు చేసి వెనుదిరిగారు.
ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్జ్, హర్లీన్ డియోల్ వంటి వారు చిన్న, వేగవంతమైన ఇన్నింగ్స్‌లు ఆడినా, ఎవరూ పెద్ద స్కోరు చేయలేదు. చివరి 6 వికెట్లు కేవలం 36 పరుగులకే కోల్పోవడంతో, టీమిండియా 48.5 ఓవర్లలో 330 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ 5 వికెట్లు తీసి భారత్ పతనానికి కారణమైంది.
331 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం మహిళల క్రికెట్‌లో ఒక అసాధారణమైన సవాలు. కానీ ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ ఈ లక్ష్యాన్ని సుసాధ్యం చేసింది. హీలీ, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ జోడీ 11.2 ఓవర్లలోనే 85 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చింది. కెప్టెన్ అలిస్సా హీలీ కేవలం 84 బంతుల్లోనే తన 6వ వన్డే సెంచరీని నమోదు చేసింది. హీలీ (142 పరుగులు), ఆష్లీ గార్డ్‌నర్ (45 పరుగులు) కలిసి 95 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
చివరి వరకు పోరాడిన ఆస్ట్రేలియా జట్టు 49 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, మహిళల వన్డే చరిత్రలో అతిపెద్ద సక్సెస్‌ఫుల్ రన్ ఛేజ్ రికార్డును నెలకొల్పింది. ఒకానొక దశలో ఆస్ట్రేలియా విజయం సులువుగా కనిపిస్తున్నా, అమన్‌జోత్ కౌర్‌తో సహా భారత బౌలర్లు 38 పరుగుల వ్యవధిలో హీలీ, గార్డ్‌నర్‌తో సహా 4 వికెట్లు తీసి మ్యాచ్‌ను మళ్లీ ఉత్కంఠగా మార్చారు.
ఈ సమయంలో గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లిన ఎల్లీస్ పెర్రీ (47 నాటౌట్) మళ్లీ క్రీజులోకి వచ్చి, కిమ్ గార్త్‌తో కలిసి జట్టును గెలిపించింది. 49వ ఓవర్ చివరి బంతికి పెర్రీ సిక్స్ కొట్టి ఆస్ట్రేలియాకు 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందించింది.
దిగజారిన భారత్ స్థానం
ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి తర్వాత పాయింట్స్ టేబుల్‌లో మార్పులు వచ్చాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా జట్టు భారత్‌పై సాధించిన విజయంతో కలిపి టోర్నీలో తమ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా ప్రస్తుతం 7 పాయింట్లతో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. శ్రీలంకతో జరిగిన ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఆసీస్‌కు ఇతరులతో పాయింట్లు పంచుకోక తప్పలేదు. దీంతో, గతంలో టాప్‌లో ఉన్న ఇంగ్లాండ్‌ను వెనక్కి నెట్టి ఆస్ట్రేలియా తిరిగి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
టీమిండియాకు ఈ టోర్నీలో ఇది వరుసగా రెండో ఓటమి. గతంలో సౌత్ ఆఫ్రికాపై కూడా భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. నాలుగు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు 4 పాయింట్స్ సాధించి ప్రస్తుతానికి మూడో స్థానంలోనే కొనసాగుతోంది. అయితే, వరుస ఓటముల కారణంగా భారత జట్టు నెట్ రన్‌రేట్ గణనీయంగా పడిపోయింది.
ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా జట్టుకు కూడా 4 పాయింట్లు ఉన్నాయి. ఈరోజు జరగబోయే మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా… బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిచినట్లయితే, నెట్ రన్‌రేట్ పరంగా అది భారత్‌ను దాటి మూడో స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే, భారత జట్టు ఒక స్థానం పడిపోయి నాలుగో స్థానంలోకి దిగజారే ప్రమాదం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..