T20 WorldCup 2026 : పాక్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో నిప్పులు చెరుగుతున్న స్టార్ పేసర్

T20 WorldCup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 సమరానికి ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఊపిరి పీల్చుకుంది. ఆ జట్టు స్టార్ పేసర్, బౌలింగ్ వెన్నెముక షాహీన్ షా ఆఫ్రిది గాయం నుంచి కోలుకుని మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఆఫ్రిది ఫిట్‌నెస్‌పై వస్తున్న వార్తలు పాక్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

T20 WorldCup 2026 : పాక్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో నిప్పులు చెరుగుతున్న  స్టార్ పేసర్
Shaheen Afridi

Updated on: Jan 16, 2026 | 9:47 AM

T20 WorldCup 2026 : పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ షాహీన్ షా ఆఫ్రిది మళ్లీ బంతి పట్టాడు. బిగ్ బాష్ లీగ్ ఆడుతున్న సమయంలో మోకాలి గాయానికి గురైన ఆఫ్రిది, వరల్డ్ కప్‌కు దూరమవుతాడనే ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం అతను గాయం నుంచి పూర్తిగా కోలుకుని నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో దాదాపు 15 నిమిషాల పాటు పూర్తి రన్-అప్‌తో బౌలింగ్ చేయడమే కాకుండా, అంతే సమయం బ్యాటింగ్ కూడా చేశాడు. ఎక్కడా అసౌకర్యం కలగకపోవడంతో పాక్ క్రికెట్ బోర్డు వైద్య బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. పాక్ మెడికల్ ప్యానెల్ చీఫ్ డాక్టర్ జావేద్ ముఘల్ ఆధ్వర్యంలో ఆఫ్రిది రిహాబిలిటేషన్ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం అతను రోజుకు 15 నుంచి 25 నిమిషాల పాటు బౌలింగ్ చేస్తున్నాడని, క్రమంగా ఈ సమయాన్ని పెంచుతామని వైద్యులు తెలిపారు. వచ్చే వారం నాటికి అతను పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించి, తన మునుపటి వేగంతో బంతులు విసురుతాడని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. 2022 వరల్డ్ కప్ ఫైనల్‌లో గాయం కారణంగా అతను మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది, అప్పట్లో అది పాక్ ఓటమికి ఒక కారణమైంది. ఈసారి అలా జరగకూడదని పీసీబీ జాగ్రత్త పడుతోంది.

ఈ నెల చివర్లో ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు టీ20ల సిరీస్‌లో షాహీన్ ఆడే అవకాశం ఉంది. అయితే వరల్డ్ కప్‌కు ముందు అనవసరంగా రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక, అతనికి ఆస్ట్రేలియా సిరీస్‌లో విశ్రాంతినిచ్చి నేరుగా ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో బరిలోకి దింపాలని మేనేజ్‌మెంట్ యోచిస్తోంది. గత బిగ్ బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ తరఫున ఆడిన షాహీన్, కేవలం 2 వికెట్లు మాత్రమే తీసి నిరాశపరిచాడు. అదే సమయంలో గాయపడటంతో పీసీబీ అతన్ని వెంటనే లాహోర్‌కు పిలిపించి చికిత్స అందించింది.

షాహీన్ ఆఫ్రిది రాకతో పాకిస్థాన్ బౌలింగ్ విభాగం మళ్లీ బలోపేతమైంది. పవర్ ప్లేలో వికెట్లు తీయడంలో దిట్ట అయిన షాహీన్ లేకపోతే పాక్ గెలవడం కష్టమని విశ్లేషకులు భావిస్తుంటారు. ప్రస్తుతం అతను ఆరోగ్యంగా ఉన్నాడని తేలడంతో పాక్ కెప్టెన్, కోచ్‌లు ఊపిరి పీల్చుకున్నారు. మరి ఈ వరల్డ్ కప్‌లో షాహీన్ తన ఇన్-స్వింగర్లతో ప్రత్యర్థి బ్యాటర్ల వికెట్లు ఎలా ఎగురగొడతాడో వేచి చూడాలి.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..