
BCCI vs Gautam Gambhir: భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పనితీరుపై మరోసారి చర్చ మొదలైంది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ 0-2 తేడాతో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో, బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) గంభీర్ వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
ఇటీవల కోల్‌కతా టెస్టు అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో గంభీర్ మాట్లాడిన తీరు బీసీసీఐ అధికారులకు నచ్చలేదని తెలుస్తోంది. ముఖ్యంగా పిచ్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బహిరంగంగా జట్టు ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు చెప్పినప్పటికీ, ఆయన మాటల్లో కనిపించిన అసహనం, పొంతన లేని సమాధానాలు బీసీసీఐ పెద్దలకు రుచించలేదని హిందుస్థాన్ టైమ్స్ నివేదిక పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు జట్టులో అనవసరమైన గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని బోర్డు భావిస్తోంది.
టెస్టుల్లో వరుస వైఫల్యాలు..
రాహుల్ ద్రవిడ్, రవి శాస్త్రి హయాంలో సొంతగడ్డపై భారత్ అద్భుత విజయాలు సాధించింది. కానీ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా వరుసగా హోమ్ సిరీస్‌లను కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆల్ రౌండర్ల కోసం స్పెషలిస్ట్ బ్యాటర్లు, బౌలర్లను పక్కన పెట్టే గంభీర్ వ్యూహాలను మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ఈ ప్రయోగాలు టెస్టు క్రికెట్‌కు కావాల్సిన స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
టీ20 వరల్డ్ కప్ కీలకం..
ప్రస్తుతానికి గంభీర్‌కు బీసీసీఐ మద్దతు ఉన్నప్పటికీ, పరిస్థితి ఎప్పుడైనా మారవచ్చని నివేదికలు చెబుతున్నాయి. 2026 ఆగస్టు వరకు భారత్‌కు మరో హోమ్ టెస్టు సిరీస్ లేదు. అయితే, 2026లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో జట్టు ప్రదర్శన గంభీర్ భవిష్యత్తును నిర్ణయించనుంది. వైట్-బాల్ క్రికెట్‌లో ఆయనకు ఉన్న రికార్డు కారణంగా ప్రస్తుతానికి టెస్టు కోచ్‌గా కొనసాగిస్తున్నా, వరల్డ్ కప్‌లో విఫలమైతే మాత్రం ఆయనపై వేటు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
మరన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..