BCCI: ఆసియా కప్‌లో భారత్‌ పాల్గొనట్లేదని వార్తలు.. బీసీసీఐ సంచలన ప్రకటన!

ఈ సారి జరగబోయే ఆసియా కప్‌ టోర్నిలో భారత్ పాల్గొనడం లేదని..టీమిండియా టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు కొంత ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని బీసీసీఐ ఖండించింది. ఈ వార్తల్లో నిజం లేదని.. ఆసియా కప్‌ టోర్నీ గురించి బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరపలేదని తెలిపింది.

BCCI: ఆసియా కప్‌లో భారత్‌ పాల్గొనట్లేదని వార్తలు.. బీసీసీఐ సంచలన ప్రకటన!
Bcci

Updated on: May 19, 2025 | 9:58 PM

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాది జరగబోయే ఆసియా కప్‌ టోర్నీలో భారత్‌ పాల్గొనడం లేదని.. టోర్నీ నుంచి టీమ్‌ఇండియా వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ సెప్టెంబరులో జరగబోయే మెన్స్‌ ఆసియా కప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయిన భారత్‌ పాల్గొనట్లేదని.. ఇదే కాకుండా జూన్‌లో జరగబోయే ఉమెన్స్‌ ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ నుంచి కూడా తప్పుకుంటుందని బీసీసీఐ నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారం నిజమైనట్టు భారత్‌ నిజంగానే ఆసియా కప్‌ టోర్నిలో పాల్గొనట్లేదని సోమవారం కొన్ని మీడియా కథనాలు వచ్చాయి. అయితే ఈ ప్రచారంపై తాజాగా బీసీసీఐ స్పందించింది. ఆసియా కప్‌లో భారత్‌ పాల్గొనట్లేదనే వార్తలను ఖండించింది. ఈ టోర్నీ గురించి బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు కూడా జరపలేదని స్పష్టం చేసింది.

ఇక ఈ వార్తలపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మాట్లాడుతూ ఇలా అన్నారు.. సోమవారం ఉదయం నుండి ఆసియా కప్, ఉమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌ టోర్నీలో పాల్గొనకూడదని BCCI నిర్ణయించినట్లు కొన్ని వార్తల నివేదికలు మా దృష్టికి వచ్చాయని.. ఆ వార్తల్లో ఎంత వరకూ నిజం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏసీసీ ఈవెంట్ల గురించి ఇప్పటి వరకు బీసీసీఐ ఎలాంటి చర్చలు జరపలేదని తెలిపారు. ప్రస్తుతం బీసీసీఐ దృష్టంతా ఐపీఎల్‌ను సరిగ్గా నిర్వహించడంపైనే ఉందన్నారు. దీంతో పాటు భారత పురుషుల, మహిళల జట్లకు ఇంగ్లాండ్‌తో జరగబోయే సిరీస్‌పై తాము దృష్టి పెట్టామని ఆయన చెప్పుకొచ్చారు.

ఏసీసీ ఈవెంట్‌ల గురించి  ఎలాంటి చర్చ జరిగిన వాటిని బీసీసీఐ కచ్చితంగా ప్రజల ముందుకు తీసుకొస్తుందని ఆయన అన్నారు. అప్పటి వరకు ఇలాంటి ఊహాజనితమైన వార్తలను ఎవరూ నమ్మవద్దని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..