
Asia Cup 2025: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) మధ్య నెలకొన్న వివాదం తీవ్రరూపం దాల్చింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడిగా, పీసీబీ (PCB) ఛైర్మన్‌గా ఉన్న నఖ్వీ.. తన ద్వంద్వ పాత్రపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కి ఫిర్యాదు చేయడానికి బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
మొహ్సిన్ నఖ్వీ ప్రస్తుతం పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి హోదాలో కొనసాగుతూనే, పీసీబీ ఛైర్మన్‌గా, ఏసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక రాజకీయ పదవిలో ఉన్న వ్యక్తి క్రికెట్ బోర్డులో అడ్మినిస్ట్రేటర్‌గా ఉండటం ఐసీసీ గవర్నెన్స్ నిబంధనలకు, నియమాలకు విరుద్ధమని బీసీసీఐ వాదిస్తోంది.
నఖ్వీ రెండు పదవుల్లో ఏదో ఒక దానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తాలని భారత బోర్డు చార్జీల జాబితాను సిద్ధం చేసింది. ఈ విషయంలో అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) మద్దతు కూడా భారత్‌కు ఉండనున్నట్లు సమాచారం.
బీసీసీఐ ప్రధానంగా లేవనెత్తాలనుకుంటున్న అంశాలలో ఆసియా కప్ 2025 (Asia Cup 2025) ఫైనల్ తర్వాత తలెత్తిన ట్రోఫీ వివాదం కీలకం. భారత్ ఫైనల్‌లో విజయం సాధించిన తర్వాత, భారత ఆటగాళ్లు రాజకీయ ఉద్రిక్తతల కారణంగా, మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ స్వీకరించడానికి నిరాకరించారు.
దీంతో నఖ్వీ ట్రోఫీని ఇతరులకు అప్పగించకుండా తనతో పాటు ఏసీసీ కార్యాలయానికి తీసుకెళ్లారని, ఇప్పటికీ భారత జట్టుకు ట్రోఫీని అప్పగించలేదని బీసీసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాను స్వయంగా ట్రోఫీని అందించాలని నఖ్వీ పట్టుబట్టగా, బీసీసీఐ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. ట్రోఫీని త్వరగా అప్పగించకపోతే ఐసీసీ వద్దకు వెళ్తామని హెచ్చరించింది.
ప్రస్తుతం ఆసియాకప్ ట్రోఫీ ఇంకా ఏసీసీ ప్రధాన కార్యాలయంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఐసీసీ సమావేశం ఈ రెండు క్రికెట్ బోర్డుల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదానికి వేదిక కానుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..