భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా(Wriddhiman Saha)కు సీనియర్ జర్నలిస్టు నుంచి బెదిరింపులు రావడంపై విచారణ చేపట్టేందుకు బీసీసీఐ(BCCI) ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. “త్రిసభ్య కమిటీలో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా(Rajeev shukla), బీసీసీఐ కోశాధికారి మిస్టర్ అరుణ్ సింగ్ ధుమాల్, బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మెంబర్ ప్రభతేజ్ సింగ్ భాటియా ఉన్నారు. ఈ కమిటీ వచ్చే వారంలో విచారణ ప్రారంభిస్తుంది” అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న క్రికెటర్‌గా ఉన్న సాహాను ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ కోసం బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని గ్రహించిన బీసీసీఐ, అపెక్స్ బోర్డు సాహాతో సంప్రదింపులు జరిపిందని, ఈ విషయంపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు బీసీసీఐ వెల్లడించింది.
శ్రీలంకతో జరిగే సిరీస్‌కు భారత జట్టులో వికెట్ కీపర్-బ్యాటర్ చోటు దక్కించుకోలేదు. ఆ తర్వాత తనను బెదిరించిన జర్నలిస్టు పేరును వెల్లడించడానికి సాహా నిరాకరించాడు. “బీసీసీఐ నుండి నాకు ఇంకా ఎటువంటి సమాచారం అందలేదు. వారు నన్ను (జర్నలిస్టు) పేరు చెప్పమని అడిగితే, ఒకరి కెరీర్‌కు హాని కలిగించడం, ఒక వ్యక్తిని కిందకి లాగడం నా ఉద్దేశం కాదని నేను వారికి చెబుతాను. అందుకే నేను నా ట్వీట్‌లో పేరును వెల్లడించలేదు. ఒక ఆటగాడి కోరికను గౌరవించకుండా ఇలాంటి పనులు చేసే వారు మీడియాలో ఉన్నారనే వాస్తవాన్ని బహిర్గతం చేయడమే నా ట్వీట్ ముఖ్య ఉద్దేశమని” సాహా ది ఇండియన్ ఎక్సప్రెస్‌తో మంగళవారం చెప్పాడు.