
Bangladesh : 2026 టీ20 వరల్డ్ కప్ వేదికల విషయంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య నడుస్తున్న వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. పాకిస్థాన్ బాటలోనే నడుస్తూ, భారత్‌లో ఆడేందుకు సవాలక్ష సాకులు చెబుతున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, ఇప్పుడు ఐసీసీ ముందు ఒక వింత కోరికను ఉంచింది. తన మ్యాచ్‌లను భారత్ నుండి తరలించడం సాధ్యం కాదని అర్థం చేసుకున్న బీసీబీ, ఇప్పుడు ఏకంగా గ్రూపు మార్చమంటూ కొత్త పల్లవి అందుకుంది. అసలు విషయం ఏమిటంటే.. ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి తప్పించిన ఉదంతం తర్వాత భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో 2026 టీ20 ప్రపంచకప్‌లో తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బీసీబీ మొండికేసింది. అయితే ఈ ప్రతిపాదనను ఐసీసీ ఏమాత్రం పట్టించుకోలేదు. షెడ్యూల్ మార్చడం కుదరదని స్పష్టం చేయడంతో, బంగ్లాదేశ్ ఇప్పుడు మైండ్ గేమ్ మొదలుపెట్టింది. “మా మ్యాచ్‌లు మార్చడం కుదరకపోతే.. కనీసం మా గ్రూపునైనా మార్చండి” అంటూ కొత్త ప్రతిపాదనను ఐసీసీ ముందు పెట్టింది.
ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ గ్రూప్-సిలో ఉంది. ఇందులో వెస్టిండీస్, ఇంగ్లాండ్, నేపాల్, ఇటలీ వంటి జట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్ తన లీగ్ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబైలలో ఆడాల్సి ఉంది. కానీ వీరికి భారత్‌లో ఆడటం ఇష్టం లేదు. అందుకే గ్రూప్-బిలో ఉన్న ఐర్లాండ్ స్థానంలో తమను చేర్చమని కోరుతోంది. ఎందుకంటే గ్రూప్-బి మ్యాచ్‌లు శ్రీలంకలోని కొలంబో, పల్లెకెలె వేదికగా జరగనున్నాయి. అంటే గ్రూపు మారితే ఆటోమేటిక్ గా వేదిక కూడా మారుతుందన్నది బంగ్లాదేశ్ ఎత్తుగడ. ఐర్లాండ్‌ను గ్రూప్-సికి పంపి, తమను శ్రీలంకలో ఆడే గ్రూపులోకి చేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతినిధులు ఇటీవల ఐసీసీ అధికారులతో భేటీ అయ్యారు. తమ టీమ్, మీడియా ప్రతినిధులు, అభిమానుల భద్రత దృష్ట్యా భారత్‌లో ఆడటం క్షేమం కాదని వారు వాదిస్తున్నారు. ఐసీసీ ప్రతినిధులు గౌరవ్ సక్సేనా, ఆండ్రూ ఎఫ్‌గ్రేవ్ ఈ భేటీలో పాల్గొన్నారు. భారత్‌లో కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని ఐసీసీ హామీ ఇస్తున్నప్పటికీ, బీసీబీ మాత్రం శ్రీలంక వైపే మొగ్గు చూపుతోంది.
బంగ్లాదేశ్ కోరుతున్నట్లుగా గ్రూపులను మార్చడం అంత సులభం కాదు. ఇది జరిగితే మొత్తం టోర్నమెంట్ షెడ్యూల్, టికెట్ సేల్స్, బ్రాడ్‌కాస్టింగ్ ఒప్పందాలన్నీ తారుమారవుతాయి. కేవలం ఒక దేశం కోసం ఇంతటి రిస్క్ తీసుకోవడానికి ఐసీసీ సిద్ధంగా లేదు. ఆచరణాత్మకంగా అనేక ఇబ్బందులు ఉన్నందున, బంగ్లాదేశ్ పెట్టిన ఈ గ్రూప్ మార్పిడి కండిషన్‌ను ఐసీసీ తిరస్కరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.