
Mohammad Rizwan Retired Out: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో సోమవారం సిడ్నీ థండర్ వర్సెస్ మెల్బోర్న్ రెనెగేడ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఒక చారిత్రాత్మక నిర్ణయానికి వేదికైంది. మెల్బోర్న్ రెనెగేడ్స్ తరపున ఆడుతున్న పాకిస్థాన్ స్టార్ మొహమ్మద్ రిజ్వాన్‌ను, అతని నెమ్మదైన బ్యాటింగ్ కారణంగా కెప్టెన్ విల్ సదర్లాండ్ ఇన్నింగ్స్ మధ్యలోనే వెనక్కి పిలిపించారు. దీంతో బీబీఎల్ చరిత్రలో ‘రిటైర్డ్ అవుట్’ అయిన తొలి విదేశీ ఆటగాడిగా రిజ్వాన్ నిలిచాడు.
సిడ్నీ థండర్‌తో జరిగిన ఈ పోరులో మెల్బోర్న్ రెనెగేడ్స్ మొదట బ్యాటింగ్ చేపట్టింది. నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మొహమ్మద్ రిజ్వాన్ క్రీజులో పాతుకుపోయినప్పటికీ, ఆశించిన స్థాయిలో పరుగులు రాబట్టలేకపోయాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో భారీ షాట్లు ఆడాల్సిన సమయంలో రిజ్వాన్ సింగిల్స్‌కే పరిమితమయ్యాడు. ఆయన 23 బంతుల్లో కేవలం 26 పరుగులు (2 ఫోర్లు, 1 సిక్సర్) మాత్రమే చేశాడు. ఆయన స్ట్రైక్ రేట్ 113 దగ్గరే ఆగిపోవడంతో, స్కోరు బోర్డు వేగం తగ్గింది.
ఇన్నింగ్స్ 18 ఓవర్లు ముగిసే సమయానికి మెల్బోర్న్ జట్టు 154/5 స్కోరుతో ఉంది. ఇన్నింగ్స్ ముగియడానికి ఇంకా 12 బంతులు మాత్రమే మిగిలి ఉండటంతో, భారీ హిట్టర్లు అవసరమని కెప్టెన్ విల్ సదర్లాండ్ భావించారు. డగౌట్ నుంచి సిగ్నల్ రావడంతో, రిజ్వాన్ ఎటువంటి గాయం లేకపోయినప్పటికీ మైదానాన్ని వీడాల్సి వచ్చింది. నిబంధనల ప్రకారం దీనిని ‘రిటైర్డ్ అవుట్’గా పరిగణిస్తారు.
🚨Global embarrassment for Pakistan Cricket. 🚨
Md Rizwan was called off due to his slow batting. pic.twitter.com/EodUqzgoGE
— Tech-Knight ® (@TechWiz97) January 12, 2026
రిజ్వాన్ స్థానంలో స్వయంగా కెప్టెన్ విల్ సదర్లాండ్ క్రీజులోకి వచ్చాడు. అయితే ఈ మాస్టర్ ప్లాన్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సదర్లాండ్ ఎదుర్కొన్న మొదటి బంతికే రన్ అవుట్ అయి పెవిలియన్ చేరాడు. చివరి రెండు ఓవర్లలో రెనెగేడ్స్ జట్టు కేవలం 16 పరుగులు మాత్రమే జోడించగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. పాక్ ఆల్ రౌండర్ హసన్ ఖాన్ (31 బంతుల్లో 46) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Muhammad Rizwan has been retired out by the Melbourne Renegades 👀 #BBL15 pic.twitter.com/AuTGoTIHqb
— KFC Big Bash League (@BBL) January 12, 2026
ఈ సీజన్‌లో మొహమ్మద్ రిజ్వాన్ ప్రదర్శన నిరాశాజనకంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఆయన కేవలం 167 పరుగులు మాత్రమే చేశాడు. ఆయన ఓవరాల్ స్ట్రైక్ రేట్ 101 గా ఉండటం టీ20 ఫార్మాట్‌లో ఆందోళన కలిగించే అంశం. పాకిస్థాన్ వైట్ బాల్ కెప్టెన్ అయిన రిజ్వాన్‌ను ఇలా మధ్యలోనే వెనక్కి పిలిపించడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
గతంలో ఐపీఎల్‌లో రవిచంద్రన్ అశ్విన్ ఇలాంటి సాహసం చేయగా, ఇప్పుడు బీబీఎల్‌లో రిజ్వాన్ రూపంలో మరో ఉదాహరణ కనిపిస్తోంది. జట్టు ప్రయోజనాల కోసం ఆటగాళ్లను రిటైర్డ్ అవుట్ చేయడం ఆధునిక క్రికెట్‌లో ఒక వ్యూహంగా మారుతోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..