కూరగాయలు అమ్ముతూ జీవనోపాధి.. కట్‌చేస్తే.. భారత జట్టులో లక్కీ ఛాన్స్.. తొలి మ్యాచ్‌లోనే అద్భుతం.. ఎవరంటే?

U-19 Tri-Series: కరోనా కారణంగా అతను తన జీవనోపాధిని కోల్పోయాడు. కుటుంబ పరిస్థితులు అతన్ని కూరగాయలు అమ్మి కడుపు నింపుకోవాల్సిన పరిస్థితికి నెట్టాయి. అయినప్పటికీ, ఆ కష్ట కాలంలో కూడా అతను క్రికెటర్ కావాలనే కలను వదులుకోలేదు. దీంతో భారత జట్టులో వచ్చిన లక్కీ ఛాన్స్‌తో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాడు.

కూరగాయలు అమ్ముతూ జీవనోపాధి.. కట్‌చేస్తే.. భారత జట్టులో లక్కీ ఛాన్స్.. తొలి మ్యాచ్‌లోనే అద్భుతం.. ఎవరంటే?
Ashutosh Mahida

Updated on: Nov 18, 2025 | 1:46 PM

Who is Ashutosh Mahida: కష్టాలను అధిగమించిన వారికి విజయం తప్పకుండా దక్కుతుందని అంటుంటారు. ప్రస్తుతం అండర్-19 ట్రై-సిరీస్‌లో ఆడుతున్న 19 ఏళ్ల క్రికెటర్ ఆశుతోష్ మాహిదా కథ కూడా ఇలాంటిదే. ఈ సిరీస్‌లో ఆశుతోష్ మాహిదా అండర్-19 ఇండియా-ఏ జట్టులో భాగమయ్యాడు. అయితే, అతను కష్టాలకు తలొగ్గి ఉంటే ఈ స్థాయికి చేరుకునేవాడు కాదు. కరోనా కారణంగా అతను తన జీవనోపాధిని కోల్పోయాడు. కుటుంబ పరిస్థితులు అతన్ని కూరగాయలు అమ్మి కడుపు నింపుకోవాల్సిన పరిస్థితికి నెట్టాయి. అయినప్పటికీ, ఆ కష్ట కాలంలో కూడా అతను క్రికెటర్ కావాలనే కలను వదులుకోలేదు.

కూరగాయలు అమ్ముతూ..

ఆశుతోష్ మాహిదా తండ్రి చిరాగ్ మాహిదా ఒక కొరియోగ్రాఫర్. కుటుంబం బాగానే నడుస్తోంది. కానీ, కరోనా మహమ్మారి అతని తండ్రి ఉద్యోగాన్ని దూరం చేసింది. దీంతో కుటుంబ పోషణ కోసం కూరగాయలు అమ్మక తప్పలేదు. ఈ కష్ట సమయంలో ఆశుతోష్ మాహిదా కూడా తన తండ్రికి సహాయం చేశాడు. అయితే, తన కొడుకు క్రికెట్ ఆడటం మానేయాలని అతని తండ్రి ఎప్పుడూ కోరుకోలేదు. ఆ కష్ట సమయంలో కూడా తన కొడుకును క్రికెట్ ఆడుతూ ఉండమని ప్రోత్సహించాడు.

కష్ట సమయం తొలగిపోయాక మారిన పరిస్థితులు..

ఈ విషయాలన్నీ ఆశుతోష్ మాహిదా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడినప్పుడు వెల్లడించాడు. ఆ కాలం చాలా కష్టమైనప్పటికీ, తాను ఎప్పుడూ క్రికెట్‌ను వదులుకోలేదని అతను చెప్పుకొచ్చాడు. కాలం మారడంతో తమ పరిస్థితులు కూడా తిరిగి మారాయని, తన తండ్రి మళ్లీ కొరియోగ్రఫీని ప్రారంభించారని మాహిదా చెప్పాడు.

ఇవి కూడా చదవండి

మొదటి అంతర్జాతీయ టోర్నమెంట్..

ఆశుతోష్ మాహిదా 2024లో విజయ్ మర్చంట్ ట్రోఫీ, అండర్-19 కూచ్ బిహార్ ట్రోఫీలో పాల్గొని, ఆడిన 5 మ్యాచ్‌లలో 16 వికెట్లు తీశాడు. అండర్-19 ట్రై-సిరీస్ తన మొదటి అంతర్జాతీయ టోర్నమెంట్ అని ఆశుతోష్ తెలిపాడు. ఈ టోర్నమెంట్‌లో అండర్-19 ఇండియా-ఏ, అండర్-19 ఇండియా-బీ జట్లతో పాటు మూడవ జట్టు ఆఫ్ఘనిస్తాన్ ఉంది.

మొదటి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన..

టోర్నమెంట్‌లోని మొదటి మ్యాచ్‌లోనే ఆశుతోష్ మాహిదా తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. నవంబర్ 17న జరిగిన అండర్-19 ట్రై-సిరీస్ మొదటి మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు ఇండియా-బీ జట్టును 37 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ ఆశుతోష్ మాహిదా 9 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..