U19 World Cup 2026 : ఓటమికి సాకులా లేక నిజంగానే అన్యాయం జరిగిందా? బంగ్లాదేశ్ ఆరోపణల వెనుక అసలు కథ

U19 World Cup 2026 : అండర్-19 ప్రపంచకప్ 2026 నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమణ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సూపర్ సిక్స్ దశలో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత, బంగ్లాదేశ్ తన వైఫల్యానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ రూపొందించిన షెడ్యూల్ కారణమని ఆరోపించింది.

U19 World Cup 2026 : ఓటమికి సాకులా లేక నిజంగానే అన్యాయం జరిగిందా? బంగ్లాదేశ్ ఆరోపణల వెనుక అసలు కథ
U19 World Cup 2026

Updated on: Jan 28, 2026 | 1:56 PM

U19 World Cup 2026 : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి, ఐసీసీకి మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ 2026 కోసం భారత్‌కు రావడానికి నిరాకరించి టోర్నీ నుంచే తప్పుకున్న బంగ్లాదేశ్, ఇప్పుడు అండర్-19 ప్రపంచకప్‌లో కూడా ఐసీసీపై విమర్శలు గుప్పించింది. సోమవారం జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన అనంతరం బంగ్లాదేశ్ గేమ్ డెవలప్‌మెంట్ కోఆర్డినేటర్ హబీబుల్ బషర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

హబీబుల్ బషర్ మాట్లాడుతూ.. టోర్నీ ఆరంభం నుంచి బంగ్లాదేశ్ జట్టు విపరీతమైన ప్రయాణాలు చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐసీసీ నిబంధనల ప్రకారం జట్లు అంతర్గత ప్రయాణాలకు విమానాలు వాడకూడదని, కేవలం బస్సుల్లోనే వెళ్లాలని సూచించింది. “భారత్‌తో మ్యాచ్‌కు ముందు మా కుర్రాళ్లు అలసిపోకూడదని బంగ్లాదేశ్ బోర్డు సొంత ఖర్చుతో విమాన ప్రయాణం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఐసీసీ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మేము వార్మప్ మ్యాచ్‌ల కోసం మాస్వింగో వెళ్ళాలి, మళ్ళీ బులవాయోకు రావాలి. ఇలా వెనక్కి ముందుకి తిరగడంతో ఆటగాళ్ళు తీవ్రంగా అలసిపోయారు” అని ఆయన పేర్కొన్నారు.

బంగ్లాదేశ్ ఆరోపణల ప్రకారం.. ఇతర పెద్ద జట్లకు ఐసీసీ వెసులుబాటు కల్పించిందని తెలుస్తోంది. భారత జట్టు తన గ్రూప్ మ్యాచ్‌లు, ప్రాక్టీస్ మ్యాచ్‌లు అన్నీ ఒకే వేదికలో ఆడింది. అలాగే ఆస్ట్రేలియా తన మ్యాచ్‌లన్నీ నమీబియాలోని విండ్‌హోక్‌లోనే ముగించుకుని, కేవలం సూపర్ సిక్స్ కోసం హరారేకు వచ్చింది. పాకిస్థాన్ కూడా ఇలాగే పరిమితమైన ప్రయాణాలు చేసింది. కానీ బంగ్లాదేశ్ మాత్రం జింబాబ్వేలోని వేర్వేరు నగరాల మధ్య నిరంతరం ప్రయాణించాల్సి వచ్చిందని బషర్ వాపోయారు. దీనివల్ల ప్రాక్టీస్‌కు సమయం దొరకలేదని, ఆటగాళ్లలో ఏకాగ్రత తగ్గిందని ఆయన వాదిస్తున్నారు.

వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే షెడ్యూల్ మార్చమని కోరినప్పటికీ ఐసీసీ వినలేదని బంగ్లాదేశ్ ఆరోపిస్తోంది. ఇప్పటికే సీనియర్ టీ20 వరల్డ్ కప్ విషయంలో బంగ్లాదేశ్‌ను ఐసీసీ స్కాట్లాండ్‌తో రీప్లేస్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అండర్-19 జట్టు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఐసీసీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఓటమికి సాకులు వెతుక్కుంటున్నారని కొందరు విమర్శిస్తుంటే, చిన్న జట్లకు ఐసీసీ షెడ్యూల్‌లో ప్రాధాన్యత ఇవ్వడం లేదని మరికొందరు మద్దతు తెలుపుతున్నారు. ఏదేమైనా ఈ ప్రయాణాల వివాదం ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో చర్చనీయాంశంగా మారింది.