Jofra Archer : లార్డ్స్‌లో ఆగని లడాయి.. ఎంపైర్లతో నిన్న గిల్.. నేడు ఆర్చర్

లార్డ్స్ టెస్ట్‌లో జోఫ్రా ఆర్చర్ బంతి ఆకారంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ సంఘటన డ్యూక్స్ బంతి క్వాలిటీ, బంతి మార్పుపై కొనసాగుతున్న వివాదాన్ని మరింత పెంచింది. మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు దీనిపై ఎలా స్పందించారు. 10 ఓవర్లకే పనికిరాకుండా పోవడం సరికాదని, అది కనీసం 80 ఓవర్ల వరకు బాగా ఉండాలని వారు వాదించారు.

Jofra Archer : లార్డ్స్‌లో ఆగని లడాయి.. ఎంపైర్లతో నిన్న గిల్.. నేడు ఆర్చర్
Jofra Archer (1)

Updated on: Jul 12, 2025 | 8:21 PM

Jofra Archer : లార్డ్స్‌లో మరోసారి బంతి మార్పు వివాదం మొదలైంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో శనివారం జోఫ్రా ఆర్చర్ బంతి ఆకారంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇది ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న ఈ సిరీస్‌కు మరింత ఆజ్యం పోసింది. భారత రెండో ఇన్నింగ్స్‌లో 46వ ఓవర్‌లో ఈ సంఘటన జరిగింది. కేఎల్ రాహుల్‎కు షార్ట్ బాల్ వేసిన తర్వాత జోఫ్రా ఆర్చర్ బంతి ఆకారంపై అనుమానం వ్యక్తం చేశాడు. బంతి రౌండ్‌గా ఉందా లేదా అని తనిఖీ చేసే ‘రింగ్ గేజ్’ పరీక్షలో బంతి పాస్ అయినప్పటికీ ఆర్చర్ మాత్రం నిరాశగా కనిపించాడు. అతను తన తల ఊపుతూ బంతిని మార్చకుండా కొనసాగించడంపై తనకు అభ్యంతరం ఉందని స్పష్టంగా తెలియజేశాడు.

స్కై స్పోర్ట్స్‌లో కామెంటేటర్లు ఈ విషయంపై వెంటనే స్పందించారు. ఒక కామెంటేటర్ మాట్లాడుతూ.. “బంతి ఆడటానికి పనికొస్తుందా లేదా అనేది అంపైర్ నిర్ణయించాలి. ఆటగాళ్లను ఈ విషయంలో కలగజేసుకోకూడదు” అని అన్నాడు. బంతి మీద సందేహం వచ్చినప్పడల్లా ఆటగాళ్లు కలుగజేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నాయి.ఇది పూర్తిగా అంపైర్ల కంట్రోల్లో ఉండాల్సిన విషయం.

ఇది ఇలా ఉంటే భారత్ ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో బంతి మార్చమని కెప్టెన్ శుభమన్ గిల్ పదే పదే అభ్యర్థించిన విషయం తెలిసిందే. ఒక సందర్భంలో, శుభ్‌మన్ గిల్ బంతిని పరిశీలించాలని అంపైర్లను గట్టిగా కోరడం కనిపించింది. డ్యూక్స్ బంతిని చాలాసార్లు తనిఖీ చేశారు. ఇది దాని క్వాలిటీ గురించి చర్చకు దారితీసింది.

ఈ విషయంపై మాజీ క్రికెటర్ స్టూవర్ట్ బ్రాడ్ కూడా స్పందించాడు. బంతి పరిస్థితిని అంగీకారయోగ్యం కాదు అని అన్నాడు. డ్యూక్స్ బంతి 10 ఓవర్లకే పనికిరాకుండా పోవడం సరికాదని, అది కనీసం 80 ఓవర్ల వరకు బాగా ఉండాలని అతను వాదించాడు. ఈ వివాదాల వల్ల లార్డ్స్ టెస్ట్‌లో బంతి క్వాలిటీ అనేది ఒక ముఖ్యమైన అంశంగా మారింది. ఆటగాళ్లు తరచూ బంతిని మార్చమని అంపైర్లను అడగడం దీనికి ప్రధాన కారణం.

 

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..