
ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా లార్డ్స్ మైదానం మరో రసవత్తర పోరుకు వేదికైంది. మరికొద్ది గంటల్లో ఆస్ట్రేలియా x న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్లూ ఈ రోజు జరగబోయే మ్యాచ్‌లో నువ్వా నేనా అనే రీతిలో పోటీపడే అవకాశముంది. మ్యాచ్‌కు ముందు ఆసీస్ కెప్టెన్ ఆరోన్‌ఫించ్ మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని ప్రకటించాడు. ‘కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని కివీస్ జట్టు ప్రతి ఆటనూ గెలవాలని చూస్తోంది. అది గ్రూప్ మ్యాచైనా లేదా ఫైనల్ మ్యాచ్ అయినా ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇదే వారిని ప్రత్యేకంగా నిలుపుతోంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆ జట్టు అన్ని విభాగాల్లో రాణిస్తోంది. ముఖ్యంగా ఫీల్డింగ్ విషయంలో తిరుగులేని స్థితిలో ఆడుతోంది. ప్రపంచశ్రేణి ఆటగాళ్లున్న ఆ జట్టుతో తలపడటం రసవత్తరంగా ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు’ అని ఫించ్ వివరించాడు. ఏడు మ్యాచ్‌ల్లో స్టార్క్ 19 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. విజయపథంలో ముందుకువెళ్తున్న కాంబినేషన్‌ను మార్చాలనుకోవడం లేదని, ఏ కారణమూ లేకుండా జట్టు కూర్పును మార్చడం అర్థరహితమని పేర్కొన్నాడు.