Team India : సూర్యకుమార్ వద్దు.. శ్రేయస్ అయ్యరే ముద్దు.. టీమ్ సెలక్షన్‌పై మళ్లీ మొదలైన రగడ

Asia Cup 2025 : ఆసియా కప్ 2025 లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌లో పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్‌లో కేవలం 5 పరుగులకే ఔట్ అవ్వడం, అంతకుముందు అభిషేక్ శర్మ రనౌట్‌కు పరోక్ష కారణం కావడం అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ముఖ్యంగా, తన బ్యాట్‌కు క్లియర్ ఎడ్జ్ తగిలినా క్రీజులోనే ఉండిపోవడంపై సూర్యకుమార్ యాదవ్ ను నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Team India : సూర్యకుమార్ వద్దు.. శ్రేయస్ అయ్యరే ముద్దు.. టీమ్ సెలక్షన్‌పై మళ్లీ మొదలైన రగడ
Suryakumar Yadav, Abhishek Sharma

Updated on: Sep 25, 2025 | 10:41 AM

Team India : ఆసియా కప్ 2025 సూపర్-4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‎కు చాలా నిరాశను మిగిల్చింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలం అవ్వడమే కాక, యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ రనౌట్‌కు కూడా సూర్యకుమార్ మిస్‌కమ్యూనికేషన్ కారణమైంది. ఇక అవుట్ విషయంలో ఎడ్జ్ తగిలినా కూడా వెళ్లకపోవడంపై అభిమానులు, మాజీ క్రికెటర్లు తీవ్రంగా మండిపడ్డారు. సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శన, అతని ప్రవర్తనపై ఆగ్రహించిన అభిమానులు, జట్టులోకి మళ్లీ శ్రేయస్ అయ్యర్‌ను తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.

అభిషేక్ శర్మ రనౌట్.. సూర్య మిస్‌కమ్యూనికేషన్

12వ ఓవర్ తొలి బంతిని సూర్యకుమార్ బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో కట్ చేయగా, అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ (75 పరుగులు, 37 బంతుల్లో) సింగిల్ కోసం క్రీజు వదిలి ముందుకు వచ్చాడు. కానీ సూర్యకుమార్ అతడిని వెనక్కి పంపాడు. ఈలోగా ఫీల్డర్ విసిరిన త్రోను ముస్తాఫిజుర్ అందుకొని బెయిల్స్‌ను ఎగరగొట్టాడు. దీంతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ, దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. ఈ మిస్‌కమ్యూనికేషన్‌కు సూర్యకుమార్ యాదవ్ కారణం కావడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్‌స్పోర్ట్స్‌ మ్యాన్‌ లైక్ అంటూ విమర్శలు

అభిషేక్ రనౌట్ అయిన అదే ఓవర్ చివరి బంతికి ముస్తాఫిజుర్ వేసిన బంతిని సూర్యకుమార్ ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించగా, బంతి అతని బ్యాట్‌కు ఎడ్జ్ తగిలి కీపర్ చేతుల్లో పడింది. అయితే, బంగ్లాదేశ్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేసినా అంపైర్ స్పందించలేదు. దీంతో వారు రివ్యూ తీసుకున్నారు. రీప్లేలలో స్పష్టంగా కనిపించడంతో సూర్యకుమార్ అవుట్ అని తేలింది.

అయితే, బ్యాట్‌కు గట్టిగా బంతి తగిలిన విషయం తెలుసున్నప్పటికీ, సూర్యకుమార్ క్రీజులోనే ఉండిపోవడం, థర్డ్ అంపైర్ నిర్ణయం కోసం ఎదురుచూడటంపై ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేశారు. “ఎడ్జ్ ఇంత స్పష్టంగా, బలంగా తగిలినా, ఏ క్రీడాకారుడైనా మైదానం నుంచి వెళ్లిపోయేవాడు. కానీ సూర్యకుమార్ యాదవ్ సిగ్గు లేకుండా క్రీజులోనే నిలబడ్డాడు” అంటూ కొంతమంది ఫ్యాన్స్ మండిపడ్డారు. దీనిని జెంటిల్‌మ్యాన్ గేమ్‌కు విరుద్ధంగా, అన్‌స్పోర్ట్స్‌ మ్యాన్‌ లైక్ కండక్ట్ అని కూడా ఫ్యాన్స్ అభివర్ణించారు.

శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ డిమాండ్

ఈ టోర్నమెంట్‌లో సూర్యకుమార్ ఫామ్ (7*, 47*, 0, 5) బాగోలేదు. కేవలం 11 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఈ దారుణమైన ప్రదర్శనతో ఫ్యాన్స్ సూర్య స్థానంలో వేరొకరిని తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఓ అభిమాని సోషల్ మీడియాలో.. “బీసీసీఐకి నా విన్నపం ఏంటంటే.. శ్రేయస్ అయ్యర్‌ను టీ20 ఫార్మాట్‌లో తిరిగి తీసుకురావాలి. సూర్యకుమార్ యాదవ్‌కు విశ్రాంతి ఇవ్వాలి. అతడు కేవలం కెప్టెన్ పదవిని భర్తీ చేయడానికి మాత్రమే ఉన్నాడు. గత 10 టీ20ల్లో అతని యావరేజ్ 17 కన్నా తక్కువ ఉంది. సీటు ఫిక్స్ అయితే ఇలాగే ఉంటుంది” అని కామెంట్ చేశాడు. శ్రేయస్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకోవాలని, ముఖ్యంగా మిడిల్ ఆర్డర్‌లో అతడు చాలా మంచి ఆటగాడని అభిమానులు తమ అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తున్నారు.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..