
Ravichandran Ashwin : క్రికెట్ అంటే కేవలం బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాదు.. అదొక పక్కా వ్యూహంతో కూడిన మైండ్ గేమ్ అని అశ్విన్ మరోసారి గుర్తు చేశాడు. వడోదరలో జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి వన్డేలో కివీస్ ప్రదర్శన చూసి అశ్విన్ ఆశ్చర్యపోయాడు. భారత్ ఈ మ్యాచ్ గెలిచినప్పటికీ, న్యూజిలాండ్ జట్టు అనుసరించిన అనలిటికల్ అప్రోచ్ అద్భుతమని కొనియాడాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. “న్యూజిలాండ్ టీమ్ మీటింగ్‌లో కూర్చుని, వారు మ్యాచ్ కోసం ఎలా ప్లాన్ చేస్తారో తెలుసుకోవడానికి నేను డబ్బులు చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను” అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అసలు కివీస్ టీమ్‌లో అంత స్పెషల్ ఏముంది?
అశ్విన్ విశ్లేషణ ప్రకారం.. న్యూజిలాండ్ జట్టులో ఇతర జట్లలాగా భారీ పేర్లున్న స్టార్ ప్లేయర్లు ఉండకపోవచ్చు. కానీ, ప్రతి ఆటగాడికి తన పాత్ర ఏమిటో స్పష్టంగా తెలుసు. వారు డేటా, మ్యాచ్-అప్‌లను (ఏ బౌలర్‌కు ఏ బ్యాటర్ ఇబ్బంది పడతాడు వంటివి) నమ్ముకుని బరిలోకి దిగుతారు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఒక దశలో టీమిండియా 234/2 తో పటిష్టంగా ఉన్నప్పుడు, కివీస్ బౌలర్లు తమ ప్లానింగ్‌తో వరుస వికెట్లు తీసి మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చేశారు.
భారత్ ఆటపై సునిశిత విమర్శలు
ఈ మ్యాచ్‌లో టీమిండియా నిలకడగా ఆడలేదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ క్లాస్ బ్యాటింగ్, హర్షిత్ రాణా ఆల్ రౌండ్ ప్రదర్శన లేకపోతే ఫలితం మరోలా ఉండేదని అన్నాడు. ముఖ్యంగా హర్షిత్ రాణా బ్యాటింగ్, బౌలింగ్‌లో చూపిన తెగువను అశ్విన్ ప్రత్యేకంగా అభినందించాడు. న్యూజిలాండ్ జట్టు చివరి వరకు పోరాడే తత్వం మిగిలిన జట్లకు ఒక పాఠం అని ఆయన చెప్పుకొచ్చాడు. బుధవారం రాజకోట్‌లో జరగనున్న రెండో వన్డేలో కూడా కివీస్ ఇలాంటి వ్యూహాలతోనే వస్తే టీమిండియాకు సవాలు తప్పదని హెచ్చరించాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..