
Angkrish Raghuvanshi Injury: భారత దేశవాళీ క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఒక భయంకరమైన సంఘటన చోటుచేసుకుంది. ముంబై, ఉత్తరాఖండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై యువ సంచలనం, ఐపీఎల్ స్టార్ అంగ్‌క్రిష్ రఘువంశీ (Angkrish Raghuvanshi) తలకు తీవ్ర గాయమైంది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంతో ఒక్కసారిగా మైదానంలో ఉన్న ఆటగాళ్లందరూ ఆందోళనకు గురయ్యారు.
ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్ సమయంలో ఈ ఘటన జరిగింది. బంతిని ఆపే క్రమంలో అంగ్‌క్రిష్ రఘువంశీ డైవ్ చేయగా, బంతి నేరుగా అతని తల వెనుక భాగానికి బలంగా తగిలింది. దెబ్బ తగిలిన వెంటనే రఘువంశీ మైదానంలోనే కుప్పకూలిపోయాడు. నొప్పి భరించలేక అతను విలవిల్లాడటం చూసి సహచర ఆటగాళ్లు వెంటనే మెడికల్ టీమ్‌ను పిలిచారు.
ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ రఘువంశీ కోలుకోకపోవడంతో, మెరుగైన చికిత్స కోసం అతడిని వెంటనే అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, స్కానింగ్ రిపోర్టులు వచ్చిన తర్వాతే గాయం తీవ్రతపై స్పష్టత వస్తుందని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) వర్గాలు తెలిపాయి. తలకు దెబ్బ తగలడంతో ‘కన్కషన్’ (Concussion) నిబంధనల ప్రకారం అతడిని ప్రస్తుతానికి ఆట నుంచి తప్పించారు.
Rohit Sharma’s team opener, Angkrish Raghuvanshi, got injured and was referred to the hospital in an emergency. He was taken off the field on a stretcher.🥺
Hope for everything will be good🙏 pic.twitter.com/ADBkrRHk2V
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) December 26, 2025
ఈ సీజన్‌లో ముంబై జట్టు తరపున అంగ్‌క్రిష్ రఘువంశీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కేకేఆర్ (KKR) తరపున ఐపీఎల్‌లో మెరిసిన ఈ యువ బ్యాటర్, దేశవాళీ క్రికెట్‌లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. కీలకమైన మ్యాచ్‌లో అతను గాయపడటం ముంబై జట్టుకు పెద్ద లోటుగా మారింది. రఘువంశీ స్థానంలో సబ్‌స్టిట్యూట్ ఆటగాడిని ఫీల్డింగ్‌కు పంపారు.
క్రికెట్ మైదానంలో ఆటగాళ్లు తమ శాయశక్తులా ప్రయత్నిస్తూ బంతిని ఆపే క్రమంలో ఇలాంటి ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. గతంలోనూ పలువురు ఆటగాళ్లు తలకు దెబ్బలు తగిలి కెరీర్‌ను కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. రఘువంశీ త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు.
అంగ్‌క్రిష్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అతను త్వరలోనే కోలుకుని మళ్ళీ బ్యాట్ పట్టుకోవాలని ముంబై జట్టు ఆశిస్తోంది. ఈ మ్యాచ్ ఫలితం కంటే రఘువంశీ ఆరోగ్యంపైనే అందరి దృష్టి నెలకొంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..