Rishabh Pant : పంతం తగ్గించుకోకపోతే పక్కన కూర్చోబెడతారు..రిషబ్ పంత్‌కు అమిత్ మిశ్రా స్ట్రాంగ్ వార్నింగ్

Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఆటతీరుపై మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. రిషబ్ పంత్ తన బ్యాటింగ్ శైలిని మార్చుకోకపోతే జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Rishabh Pant :  పంతం తగ్గించుకోకపోతే పక్కన కూర్చోబెడతారు..రిషబ్ పంత్‌కు అమిత్ మిశ్రా స్ట్రాంగ్ వార్నింగ్
Rishabh Pant

Updated on: Dec 24, 2025 | 10:11 AM

Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఆటతీరుపై మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. పంత్ తన బ్యాటింగ్ శైలిని మార్చుకోకపోతే జట్టులో చోటు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 2018లో అరంగేట్రం చేసిన పంత్, టెస్టుల్లో అద్భుతమైన రికార్డులు కలిగి ఉన్నప్పటికీ, నిలకడలేమి అతనికి శాపంగా మారిందని మిశ్రా అభిప్రాయపడ్డారు.

ఒకప్పుడు పంత్ అంటే కుర్రాడు, తప్పులు చేస్తాడులే అని సరిపెట్టుకునే వాళ్లమని, కానీ ఇప్పుడు అతనికి 28 ఏళ్లు వచ్చాయని మిశ్రా గుర్తు చేశారు. “రిషబ్ 2018 నుంచి జట్టులో ఉన్నాడు. ఇప్పుడు అతన్ని యంగ్ ప్లేయర్ అని అనలేము. కెరీర్‌లో ఒక స్థాయికి వచ్చాక పరిస్థితులకు తగ్గట్టుగా ఆటను మార్చుకోవడం చాలా అవసరం. కానీ పంత్ మాత్రం పదే పదే ఒకే రకమైన పొరపాట్లు చేస్తూ వికెట్ పారేసుకుంటున్నాడు” అని ఒక పాడ్‌కాస్ట్‌లో మిశ్రా విమర్శించారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రత్యర్థి జట్లు ఆటగాళ్ల బలహీనతలను లోతుగా విశ్లేషిస్తాయని మిశ్రా హెచ్చరించారు. “నువ్వు ఏ బంతిని అటాక్ చేస్తావు, ఏ బంతిని ఆడలేవు అనేది ప్రత్యర్థులు గమనిస్తున్నారు. ప్రతిసారీ నేను ఇలాగే ఆడతాను.. ఇదే నా స్టైల్ అంటే కుదరదు. అలా మొండిగా ఉంటే మరో నాలుగు ఐదు మ్యాచ్‌లు ఆడిస్తారేమో కానీ, ఆ తర్వాత జట్టు నుంచి తప్పిస్తారు. వికెట్, పరిస్థితులకు తగ్గట్టుగా గేర్ మార్చడమే గొప్ప ఆటగాడి లక్షణం” అని పంత్‌కు సూచించారు.

ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన హోమ్ టెస్ట్ సిరీస్‌లో భారత్ 0-2తో వైట్‌వాష్‌కు గురైంది. ఈ సిరీస్‌లో పంత్ బ్యాటర్‌గా కేవలం 49 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. శుభ్‌మన్ గిల్ గాయపడటంతో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటికీ, అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు నాయకత్వంలోనూ పంత్ ఆశించిన మేర రాణించలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. టర్నింగ్ ట్రాక్‌లు లేదా బౌన్స్ ఉండే పిచ్‌లపై ఒకే రకమైన షాట్లు ఆడటం వల్ల ప్రయోజనం ఉండదని మిశ్రా స్పష్టం చేశారు.

రిషబ్ పంత్ టెస్టుల్లో 8 సెంచరీలు బాది భారత వికెట్ కీపర్లలో టాప్ రికార్డు సృష్టించాడు. అయితే వైట్ బాల్ క్రికెట్(ODI, T20I)లో అతని ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుతం టెస్ట్ జట్టులో వైస్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, తన షాట్ సెలక్షన్‌ను మెరుగుపరుచుకోకపోతే త్వరలోనే అతడిపై బోర్డు కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అమిత్ మిశ్రా విశ్లేషించారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..