Abhishek Sharma: సెంచరీ మిస్.. అయినా తగ్గేదేలే! 63 బంతుల్లో 78 పరుగులతో అభిషేక్ శర్మ విధ్వంసం

Abhishek Sharma: ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ సెమీఫైనల్‌లో అభిషేక్ శర్మ శ్రీలంక-ఏపై 63 బంతుల్లో 78 పరుగులు చేశాడు. 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసినా లిస్ట్-ఏ కెరీర్‌లో ఐదో సెంచరీ సాధించలేకపోయాడు. అయినప్పటికీ 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి తన ఫామ్‌ను చాటుకున్నాడు.

Abhishek Sharma: సెంచరీ మిస్.. అయినా తగ్గేదేలే! 63 బంతుల్లో 78 పరుగులతో అభిషేక్ శర్మ విధ్వంసం
Abhishek Sharma 30 Ball Century

Updated on: Nov 26, 2026 | 6:48 PM

Abhishek Sharma: టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన బ్యాటింగ్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు. ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 సెమీఫైనల్‌లో శ్రీలంక-ఏ బౌలర్లపై దూకుడుగా ఆడుతూ 78 పరుగులు చేశాడు. అయితే అద్భుతంగా ఆడిన అతడు సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. దీంతో లిస్ట్-ఏ క్రికెట్‌లో ఐదో సెంచరీ సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. అయినప్పటికీ 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి తన ఫామ్‌ను చాటుకున్నాడు. గత మ్యాచ్‌లో తక్కువ పరుగులకే వెనుదిరిగిన అభిషేక్.. ఈసారి మాత్రం జట్టుకు కీలకమైన ఇన్నింగ్స్ అందించాడు.

63 బంతుల్లో 78 పరుగులు

దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ సెమీఫైనల్‌లో టాస్ గెలిచిన ఇండియా-ఏ కెప్టెన్ తిలక్ వర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ ఆరంభం నుంచే ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా దూకుడుగా ఆడటంతో తొలి వికెట్‌కు 80 పరుగులు వచ్చాయి. వైభవ్ 27 బంతుల్లో 40 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మతో కలిసి అభిషేక్ రెండో వికెట్‌కు 79 పరుగులు జోడించాడు. మొత్తం 63 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 78 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 123.81గా నమోదైంది.

37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

అభిషేక్ ఈ ఇన్నింగ్స్‌లో మంచి టైమింగ్‌తో బౌండరీలు సాధించాడు. కేవలం 37 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. క్రీజులో కుదురుకున్న తర్వాత భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించాడు. అయితే 22వ ఓవర్‌లో లాహిరు సమరకూన్ బౌలింగ్‌లో లాంగ్ ఆఫ్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతిని సరిగ్గా కనెక్ట్ చేయలేకపోవడంతో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికే 78 పరుగులు చేసిన అభిషేక్.. మరో 22 పరుగులు చేసి ఉంటే సెంచరీ పూర్తి చేసేవాడు. కానీ ఆ అవకాశం చేజారింది. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఐదో సెంచరీ కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.

లిస్ట్-ఏ క్రికెట్‌లో అభిషేక్ గణాంకాలివే

అభిషేక్ శర్మకు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దూకుడుగా ఆడే ఆటగాడిగా మంచి గుర్తింపు ఉంది. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఇప్పటివరకు 72 మ్యాచ్‌లు ఆడి 2,365 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 170 పరుగులు. శ్రీలంక-ఏపై చేసిన 78 పరుగులతో లిస్ట్-ఏ కెరీర్‌లో మరో అర్ధసెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఐదో సెంచరీ చేయలేకపోయినా కీలకమైన సెమీఫైనల్‌లో జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడాడు.

టోర్నీలో ఒకసారి 70.. మరోసారి 78

ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో అభిషేక్‌కు ఇది నాలుగో ఇన్నింగ్స్. పాకిస్థాన్-ఏతో జరిగిన మ్యాచ్‌లో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. నేపాల్‌పై తొమ్మిది పరుగులకే ఔటయ్యాడు. యూఏఈతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో ఐదు బంతుల్లో 12 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 53 బంతుల్లో 204 పరుగులతో చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు శ్రీలంక-ఏతో సెమీఫైనల్‌లో 78 పరుగులు చేసి తిరిగి ఫామ్‌లోకి వచ్చినట్లు నిరూపించాడు. టోర్నీలో రెండు హాఫ్ సెంచరీలు సాధించిన అభిషేక్.. కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో జట్టుకు మంచి ఆరంభం అందించడం విశేషం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us