Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై మొదలైన రచ్చ.. టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్

Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీకి ఇంకా అరంగేట్రం అవకాశం ఇవ్వకపోవడం పై ఏబీ డివిలియర్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐర్లాండ్ సిరీస్‌లోనే యువ ఆటగాడిని పరీక్షించాలని, వరుసగా విఫలమవుతున్న సీనియర్ల స్థానంలో అవకాశం ఇవ్వాల్సిందని భారత జట్టు మేనేజ్‌మెంట్‌ను విమర్శించారు.

Vaibhav Sooryavanshi : వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై మొదలైన రచ్చ.. టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డ ఏబీ డివిలియర్స్
Vaibhav Sooryavanshi

Updated on: Jul 03, 2026 | 6:52 AM

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్ జట్టులో యువ సంచలనం, 15 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం పై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తాజాగా ఈ వివాదంలోకి దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ ప్రవేశించారు. ప్రస్తుతం జరుగుతున్న టీమిండియా యూకే పర్యటనలో వైభవ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కల్పించకపోవడంపై డివిలియర్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐపీఎల్‌లో భారీ సిక్సర్లతో ప్రపంచాన్ని ఆకర్షించిన ఈ యువ ఆటగాడిని బెంచ్‌కే పరిమితం చేయడం సరైన నిర్ణయం కాదని ఆయన భారత జట్టు కోచ్‌లను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

భారత కోచ్‌ల నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి

జూన్ 26 నుంచి ప్రారంభమైన ఈ యూకే పర్యటనలో భారత జట్టు ఇప్పటికే మూడు మ్యాచ్‌లను పూర్తి చేసుకుంది. అయితే వైభవ్‌కు మాత్రం ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం రాలేదు. ప్రస్తుత ఓపెనర్లకే తాము ప్రాధాన్యత ఇస్తామని, సరైన సమయం వచ్చినప్పుడు వైభవ్‌ను ఆడిస్తామని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్‌లు చెబుతున్నారు. దీనిపై డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానల్‌లో స్పందిస్తూ.. “ఆ పసివాడిని అసలు ఎప్పుడు మైదానంలోకి వదులుతారు? అంతర్జాతీయ క్రికెట్ వాతావరణం ఎలా ఉంటుందో అతనికి చూపించడానికి ఐర్లాండ్ సిరీస్ కంటే గొప్ప అవకాశం మరొకటి లేదు. ఈ సిరీస్‌లో కూడా అతనికి అరంగేట్రం చేసే ఛాన్స్ ఇవ్వకపోవడం నిజంగా దురదృష్టకరం” అని వాపోయారు.

సంజూ శాంసన్ వరుస ఫ్లాప్‌లు

ప్రస్తుత పర్యటనలో సీనియర్ ఆటగాడు సంజూ శాంసన్ ఘోరంగా విఫలమవుతుండటంతో వైభవ్‌ను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ మరింత పెరిగింది. ఈ టూర్‌లో ఆడిన మూడు ఇన్నింగ్స్‌లలో శాంసన్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. సంజూ ఆటతీరుపై డివిలియర్స్ సైతం విమర్శలు గుప్పించారు. శాంసన్ కెరీర్‌లో ఎప్పుడూ స్థిరమైన ప్రదర్శన చేయలేదని, వరుసగా ఫ్లాప్ అవుతున్న తరుణంలో కనీసం ఒక్క ఛాన్స్ అయినా వైభవ్‌కు ఇచ్చి పరీక్షించాల్సింది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఐపీఎల్‌లో అంతటి పవర్‌ఫుల్ ప్రదర్శన చేసిన తర్వాత అతడిని పెద్ద సవాళ్లకు సిద్ధం చేయాల్సిన బాధ్యత మేనేజ్‌మెంట్‌పై ఉందన్నారు.

భారత సహాయక కోచ్‌పై డివిలియర్స్ సెటైర్లు

భారత జట్టు సహాయక కోచ్ ర్యాన్ టెన్ డోస్చాటే ఇటీవల మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీ కూడా మిగిలిన ఆటగాళ్లలాగే తన అవకాశం కోసం వేచి చూడక తప్పదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను డివిలియర్స్ తప్పుబట్టారు. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను కేవలం బెంచ్‌కే పరిమితం చేస్తే వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని హెచ్చరించారు. ఐపీఎల్ సీజన్ తర్వాత వైభవ్ మంచి ఫామ్‌లో ఉన్నాడని, ఇలాంటి సమయాల్లోనే యువ రక్తాన్ని అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేయాలని డివిలియర్స్ స్పష్టం చేశారు. ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకులతో పాటు అభిమానులు కూడా ఈ 15 ఏళ్ల కుర్రాడు ఎప్పుడు బరిలోకి దిగుతాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us