
Jasprit Bumrah : భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత కామెంటేటర్ ఆకాశ్ చోప్రా, భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా భవిష్యత్తు గురించి ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. బుమ్రా ఇకపై ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడడని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, బుమ్రాను త్వరగా రిటైర్ అయ్యేలా ఒత్తిడి చేయకూడదని భారత క్రికెట్ యాజమాన్యాన్ని ఆయన హెచ్చరించారు. ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బుమ్రా కేవలం 3 మ్యాచ్‌లలో మాత్రమే ఆడాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఆయన విమర్శలను ఎదుర్కొన్నారు.
ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ముందే బుమ్రా తన వర్క్‌లోడ్ కారణంగా కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడతారని అందరికీ తెలుసు. అయితే, మొదటి టెస్ట్ ఓడిపోయిన తర్వాత అతను మరిన్ని మ్యాచ్‌లు ఆడతాడని ఊహించినప్పటికీ, అది జరగలేదు. బుమ్రా తన వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ను సమర్థిస్తూ, ఈ బౌలర్‌ను సరైన విధంగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉందని ఆకాశ్ చోప్రా అన్నారు.
“బుమ్రా లాంటి బౌలర్ మరొకరు లేరు. అతడు 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్. అతడు ఒక కోహినూర్ డైమండ్. అతడు ఎంత ఎక్కువగా ఆడితే, అంత మంచిది. అయితే, బుమ్రా భవిష్యత్తులో ఎక్కువ టెస్టులు ఆడతాడని నేను అనుకోవడం లేదు. కానీ ఆడేంత కాలం అతను కొనసాగాలి” అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో అన్నారు.
“నిజాయితీగా చెప్పాలంటే, అతను అన్ని టెస్టులు ఆడతాడని నేను అనుకోవడం లేదు. అతను కొన్ని మ్యాచ్‌లను సెలక్ట్ చేసుకుని ఆడతాడు. ఇది సరైనదా లేదా అనేదానిపై నైతిక చర్చ అనవసరం. మీ దగ్గర బుమ్రా లాంటి ప్రపంచ స్థాయి ఆటగాడు అందుబాటులో ఉంటే, అతడికి అవకాశం దొరికినప్పుడల్లా ఆడిపించాలి” అని ఆకాశ్ చోప్రా అన్నారు. 3-4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బౌలర్లను రొటేట్ చేయడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ తాను బ్యాట్స్‌మన్‌గా ఇలా తక్కువ మ్యాచ్‌లు ఆడతానని చెబితే అది సమస్య అవుతుందని అన్నారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. జస్ప్రీత్ బుమ్రా ఆసియా కప్‌కు తాను అందుబాటులో ఉన్నానని సెలెక్టర్లకు సమాచారం అందించాడు. ఒకవేళ ఇది నిజమైతే, ఆసియా కప్ జట్టులో అతని ఎంపిక ఖాయం. ఆగస్టు 19న ఆసియా కప్ జట్టు ఎంపికపై సమావేశం జరగనుంది. ఆ తర్వాతే జట్టును అధికారికంగా ప్రకటిస్తారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..