
Aakash Chopra Suggests 5 Rule Changes Ahead of IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన లీగ్‌లలో ఒకటి. ప్రతి సంవత్సరం, ఐపీఎల్ కొత్త ఆలోచనలతో, కొత్త రూల్స్‌తో వస్తూ అభిమానులకు మరింత వినోదాన్ని అందిస్తుంది. అయితే, 2026 సీజన్ కోసం ఐపీఎల్‌ను మరింత ఉత్కంఠభరితంగా మార్చడానికి మాజీ భారత క్రికెటర్ ఆకాష్ చోప్రా 5 కీలక మార్పులను సూచించారు. ఈ మార్పులు ఆటలో డైనమిక్స్‌ను పూర్తిగా మార్చేస్తాయని, థ్రిల్‌ను అమాంతం పెంచుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
1. బోనస్ పాయింట్ విధానం: ప్రస్తుతం, ఐపీఎల్‌లో నెట్ రన్ రేట్ ప్లేఆఫ్స్ అవకాశాలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ, ఇది రోజువారీ మ్యాచ్‌లకు అంతగా ఉత్సాహాన్ని తీసుకురాదని చోప్రా అభిప్రాయపడ్డారు. దీనికి బదులుగా బోనస్ పాయింట్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు. ఒక జట్టు ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యంతో గెలిస్తే, వారికి ఒక బోనస్ పాయింట్ లభిస్తుంది. ఉదాహరణకు, 200 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోపు ఛేదించడం లేదా ప్రత్యర్థిని 200 స్కోరును 160 పరుగులలోపు కట్టడి చేయడంలాంటి సందర్భాల్లో ఈ బోనస్ పాయింట్ ఇవ్వాలి. ఈ రూల్ వల్ల నెట్ రన్ రేట్ మీద ఆధారపడకుండానే జట్లకు అదనపు పాయింట్లు వస్తాయి. ఓటమి పాలైన జట్లు కూడా బోనస్ పాయింట్ కోసం పోరాడే అవకాశం ఉంటుంది.
2. తీవ్రమైన గాయాలకు సబ్స్టిట్యూట్ ప్లేయర్: క్రికెట్‌లో కంకషన్ సబ్స్టిట్యూట్ (Concussion Substitute) విధానం ఉంది. అంటే, ఒక ఆటగాడు తలకు దెబ్బ తగిలితే, అతని స్థానంలో మరొక ప్లేయర్‌ను తీసుకునే అవకాశం ఉంటుంది. ఇదే తరహాలో తీవ్రమైన గాయాలు అయినప్పుడు కూడా ఒక లైక్-ఫర్-లైక్ సబ్స్టిట్యూట్‌ను అనుమతించాలని చోప్రా సూచించారు. భారత ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటికే ఈ నియమం ఉందని, ఐపీఎల్ ఇలాంటి కొత్త నియమాలను ప్రవేశపెట్టి మార్గదర్శకంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు.
3. మిడ్-సీజన్ ట్రాన్స్‌ఫర్ విధానాన్ని సమర్థవంతంగా వినియోగించడం: ఐపీఎల్‌లో మిడ్-సీజన్ ట్రాన్స్‌ఫర్ నియమం ఉన్నప్పటికీ, అది ఎక్కువగా వినియోగంలోకి రావడం లేదు. ఆకాష్ చోప్రా ఈ నియమాన్ని మరింత సమర్థవంతంగా చేయాలని సూచించారు. అతని ప్రతిపాదన ప్రకారం, ఒక ఆటగాడు మొదటి ఎనిమిది మ్యాచ్‌లలో వినియోగంలోకి రాకపోతే, అతను ఆటోమేటిక్‌గా బదిలీకి అందుబాటులో ఉండాలి. ప్రతి జట్టు ఇలాంటి ముగ్గురు ఆటగాళ్లను ట్రాన్స్‌ఫర్ కోసం నామినేట్ చేయాలి. ఈ రూల్ వల్ల బెంచ్‌పై కూర్చునే టాలెంట్ ఇతర జట్లకు వెళ్లి వారికి విలువను పెంచుతుంది.
4. లెగ్-సైడ్ వైడ్ రూల్‌లో మార్పు: ప్రస్తుతం, లెగ్-సైడ్ వైడ్ రూల్ చాలా కఠినంగా ఉందని చోప్రా అభిప్రాయపడ్డారు. లెగ్ స్టంప్ వెలుపల చిన్నపాటి తేడాను కూడా వైడ్‌గా పరిగణిస్తున్నారని, ఇది కొన్నిసార్లు అన్యాయంగా ఉంటుందని అన్నారు. దీనికి బదులుగా, లెగ్-సైడ్ వైడ్‌ను నిర్ణయించడానికి ఒక స్పష్టమైన లైన్‌ను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. బంతి ఆ లైన్‌ను దాటితే మాత్రమే వైడ్‌గా పరిగణించాలి.
5. పవర్ సర్జ్ నియమం: ఆస్ట్రేలియన్ బిగ్ బాష్ లీగ్‌లో ఉన్న పవర్ సర్జ్ (Power Surge) రూల్‌ను ఐపీఎల్ కూడా ప్రవేశపెట్టాలని ఆకాష్ చోప్రా సూచించారు. ఈ రూల్ ప్రకారం, బ్యాటింగ్ చేసే జట్టు ఇన్నింగ్స్‌లో ఏ సమయంలోనైనా రెండు ఓవర్ల పవర్‌ప్లేను తీసుకోవచ్చు. ఇది ఆటను మరింత ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా మారుస్తుందని ఆయన విశ్వసించారు.
ఈ ఐదు మార్పులు ఐపీఎల్ 2026 సీజన్‌ను మరింత థ్రిల్‌గా మార్చి, అభిమానులను ఉర్రూతలూగిస్తాయని ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో అభిప్రాయపడ్డారు. ఈ సూచనలపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..