
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా బెంగళూరు వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ రీ-సౌండ్ ఇచ్చే సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 85 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్న వార్నర్.. మొత్తం 124 బంతులు ఎదుర్కుని 14 ఫోర్లు, 9 సిక్సర్లతో ఏకంగా 163 పరుగులు సాధించాడు. బౌండరీలతో పాక్ బౌలర్లకు డేవిడ్ భాయ్ చుక్కలు చూపించాడు. ముఖ్యంగా పాక్ కీలక బౌలర్ హారిస్ రవూఫ్ మాత్రం వార్నర్ ఉతికారేసాడని చెప్పాలి. మరో ఓపెనర్ మార్ష్‌తో కలిసి వార్నర్ ఏకంగా రవూఫ్ వేసిన 4 ఓవర్లలో 59 పరుగులు రాబట్టారు.
ప్రపంచకప్‌నకు ముందుగా టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్ అద్భుతంగా రాణించిన వార్నర్.. మొదటి మూడు మ్యాచ్‌లలోనూ తడబడటంతో.. ఇక జట్టులో దండగే అనుకున్నారు. కానీ విమర్శకుల అంచనాలను తలకిందులు చేస్తూ వార్నర్.. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఒకదశలో డబుల్ సెంచరీ సాధిస్తాడని అందరూ ఊహించినప్పటికీ.. పాక్ బౌలర్ రవూఫ్ చక్కటి లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్‌తో వార్నర్‌ని అవుట్ చేశాడు.
వార్నర్‌కి ఇది పాకిస్తాన్‌పై నాలుగో సెంచరీ. దీంతో ఓ అరుదైన రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు వార్నర్. వన్డేలలో ఒకే జట్టుపై అత్యధిక సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లి రికార్డును వార్నర్ సమం చేశాడు. విండిస్‌పై 4సార్లు సెంచరీలు బాదేశాడు కోహ్లి. ఇక వార్నర్ ఇప్పుడు పాకిస్తాన్‌పై 4 సెంచరీలు కొట్టాడు. అయితే కోహ్లి ఒక ఏడాదిలో ఈ ఫీట్ సాధిస్తే.. వార్నర్ ఆరేళ్ల మధ్యకాలంలో ఈ రికార్డు నమోదు చేశాడు.
David Warner’s 21st ODI century leads the Australia charge in Bengaluru 🔥@mastercardindia Milestones 🏏#CWC23 | #PAKvAUS pic.twitter.com/TwxPUydS5W
— ICC Cricket World Cup (@cricketworldcup) October 20, 2023
2017లో తన వన్డే అరంగేట్ర శతకాన్ని పాకిస్తాన్‌పై బాదేశాడు వార్నర్.. ఆ తర్వాత దాదాపు ఆరేళ్ల వ్యవధిలో బాబర్ అజామ్ జట్టుపై నాలుగు సెంచరీలు కొట్టాడు డేవిడ్ భాయ్. అలాగే ప్రపంచకప్‌లలో మూడు 150 అంతకంటే ఎక్కువ వ్యక్తిగత స్కోర్లు కొట్టిన ఏకైక బ్యాట్స్‌మెన్ కూడా మన డేవిడ్ వార్నర్ భాయే. ‘నీ యవ్వా తగ్గేదేలే’ అంటూ సెంచరీ తర్వాత ‘పుష్ప’ సెలబ్రేషన్ జరిపాడు వార్నర్.