
India Vs Pakistan : భారత క్రికెట్ చరిత్రలో కొన్ని విజయాలు ఎప్పటికీ మర్చిపోలేని తీపి గుర్తులుగా మిగిలిపోతాయి. అలాంటి ఒక అద్భుతమైన విజయం సరిగ్గా ఇదే రోజున, అంటే జనవరి 20, 1980న నమోదైంది. చెన్నైలోని ప్రతిష్టాత్మక చేపాక్ స్టేడియం సాక్షిగా లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ బ్యాటింగ్ విన్యాసాలు, హర్యానా హరికేన్ కపిల్ దేవ్ ఆల్ రౌండ్ షోతో పాకిస్థాన్‌ను భారత్ చిత్తు చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో ఏకంగా 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పాక్‌పై భారత్ టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది.
ఆ మ్యాచ్‌లో సునీల్ గవాస్కర్ ఆడిన ఇన్నింగ్స్ ఒక అద్భుతం. పాక్ బౌలర్లను విసిగిస్తూ దాదాపు 10 గంటల పాటు(593 నిమిషాలు) క్రీజులో పాతుకుపోయిన గవాస్కర్, 166 పరుగులు చేసి టీమిండియాకు భారీ స్కోరును అందించారు. అప్పట్లో ఒక భారతీయ బ్యాటర్ టెస్టుల్లో ఇంత ఎక్కువ సమయం క్రీజులో ఉండటం ఒక రికార్డు. గవాస్కర్ తన ఏకాగ్రతతో పాకిస్థాన్ ఆశలపై నీళ్లు చల్లారు. ఆయన అజేయమైన ఆటతీరు వల్లనే భారత్ మ్యాచ్‌పై పట్టు సాధించగలిగింది.
బ్యాటింగ్‌లో గవాస్కర్ మెరిస్తే.. బౌలింగ్‌లో యువ కపిల్ దేవ్ పాక్ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించారు. ఈ మ్యాచ్‌లో కపిల్ ఏకంగా 11 వికెట్లు పడగొట్టి పాకిస్థాన్ పతనాన్ని శాసించారు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 56 పరుగులిచ్చి 7 వికెట్లు తీయడం విశేషం. కేవలం బౌలింగ్ మాత్రమే కాదు, బ్యాట్‌తోనూ కపిల్ వీరవిహారం చేశారు. మొదటి ఇన్నింగ్స్‌లో వేగంగా 84 పరుగులు చేసి భారత్‌కు కీలకమైన ఆధిక్యాన్ని అందించారు. కపిల్ ఆల్‌రౌండ్ ప్రదర్శన ఆ మ్యాచ్‌కు హైలెట్‌గా నిలిచింది.
పాకిస్థాన్ నిర్దేశించిన 76 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా చేధించింది. గవాస్కర్ (29 నాటౌట్), చేతన్ చౌహాన్ (46 నాటౌట్) కలిసి భారత్‌కు 10 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందించారు. 1952 తర్వాత మళ్ళీ పాకిస్థాన్‌పై భారత్ టెస్ట్ సిరీస్ గెలవడం అదే తొలిసారి. 6 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో అజేయ ఆధిక్యాన్ని సాధించి సిరీస్‌ను ముద్దాడింది. ఆ విజయం భారత క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ ఒక గర్వకారణం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..