Vaibhav Sooryavanshi: అంతర్జాతీయ వేదికపై చరిత్ర సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ

Vaibhav Sooryavanshi: భారతీయ 15 ఏళ్ల యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రతిష్టాత్మక టైమ్ 100 నెక్స్ట్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ గ్లోబల్ లిస్ట్‌లో చోటు సంపాదించిన ఏకైక భారతీయ అథ్లెట్‌గా, ఏకైక క్రికెటర్‌గా వైభవ్ అరుదైన ఘనత సాధించాడు.

Vaibhav Sooryavanshi: అంతర్జాతీయ వేదికపై చరిత్ర సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
Vaibhav Sooryavanshi

Updated on: Oct 02, 2026 | 3:56 PM

Vaibhav Sooryavanshi: భారతీయ క్రికెట్ రంగానికి చెందిన టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనతను సాధించాడు. కేవలం 15 సంవత్సరాల వయసులోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ కుర్రాడు, ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన TIME100 Next జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు. భవిష్యత్తును తీర్చిదిద్దే వర్ధమాన తారల జాబితాలో ప్రపంచం నలుమూలల నుంచి ఎంపిక చేసిన ఏడుగురు అథ్లెట్లలో వైభవ్ ఒకడిగా నిలిచాడు. విశేషం ఏంటంటే ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక క్రికెటర్ అలాగే ఏకైక భారతీయుడు కూడా వైభవ్ కావడం గమనార్హం. ఆయన ప్రతిభను గుర్తించిన టైమ్ మ్యాగజైన్ ఫినోమ్ కేటగిరీలో చేర్చి, ప్రపంచ క్రీడా రంగంలో అత్యంత ఆకర్షణీయమైన శక్తిగా మారుతున్నాడని ప్రశంసించింది.

ఎంపికైన ఇతర గ్లోబల్ అథ్లెట్లు

వైభవ్ సూర్యవంశీతో పాటు ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మరో ఆరుగురు యువ క్రీడాకారులు చోటు దక్కించుకున్నారు. వారిలో అమెరికన్ కాలేజ్ ఫుట్‌బాల్ క్వార్టర్ బ్యాక్ ఆర్చ్ మానింగ్, ఎన్బీఏ స్టార్ టైరీస్ మాక్సీ, అమెరికా మహిళల సాకర్ జట్టు డిఫెండర్ నవోమి గిర్మా ఉన్నారు. అలాగే ఫిలిప్పీన్స్ టెన్నిస్ క్రీడాకారిణి అలెగ్జాండ్రా ఈలా, అమెరికా పురుషుల సాకర్ ఆటగాడు ఫోలారిన్ బలోగున్, డబ్ల్యూఎన్బీఏ గార్డ్ ఒలివియా మైల్స్ కూడా ఈ జాబితాలో వైభవ్‌తో పాటు స్థానం పొందారు. వీరందరితో పాటు భారత్ తరఫున వైభవ్ ఒక్కడే ఈ జాబితాలో నిలవడం మన దేశానికి గర్వకారణం.

వైభవ్ సూర్యవంశీ ప్రయాణం

వైభవ్ చిన్న వయసులోనే క్రికెట్ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తూ వచ్చాడు. 2024లో బీహార్ తరఫున రంజీ ట్రోఫీ ద్వారా ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసినప్పుడు ఆయన వయసు కేవలం 12 సంవత్సరాలే కావడం విశేషం. ఆ తర్వాత ఐపీఎల్ మెగా టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ.కోటికి ఈ యువ ఆటగాడిని దక్కించుకుంది. అరంగేట్రం చేసిన తొలి ఐపీఎల్ సీజన్‌లోనే కేవలం ఏడు మ్యాచ్‌లు ఆడి అద్భుతమైన సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సీజన్‌లో 206 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 252 పరుగులు సాధించి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు.

రికార్డుల మోత.. టీమిండియాలోకి ఎంట్రీ

ఐపీఎల్ 2026 సీజన్‌లో మరింత జోరు కనబరిచిన వైభవ్ సూర్యవంశీ ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ టోర్నమెంట్‌లో ఆయన 237 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేయడం విశేషం. ఈ మెరుగైన ప్రదర్శన కారణంగా జూలై నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ ద్వారా టీమిండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తద్వారా భారత్ తరఫున అతి చిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఆరు టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆయన 189 స్ట్రైక్ రేట్‌తో 193 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉండగా, అత్యధిక స్కోరు 81 పరుగులుగా ఉంది. భవిష్యత్తులో భారత జట్టుకు ఈ కుర్రాడు మ్యాచ్ విన్నర్‌గా నిలవడం ఖాయమని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us