
CWG 2026 : గ్లాస్గో వేదికగా ఎంతో వైభవంగా సాగిన కామన్వెల్త్ గేమ్స్ 2026 నేటితో ముగింపునకు వచ్చాయి. ఈరోజు అర్థరాత్రి జరగబోయే ముగింపు వేడుకలతో (క్లోజింగ్ సెర్మనీ) ఈ క్రీడలు అధికారికంగా పూర్తవుతాయి. ఈ వేడుకలోనే తదుపరి ఆతిథ్య దేశమైన భారతదేశానికి ముఖ్యంగా 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించబోతున్న అహ్మదాబాద్ నగరానికి కామన్వెల్త్ గేమ్స్ అధికారిక జెండా, క్వీన్స్ బ్యాటన్‌ను అప్పగిస్తారు. ఈ చారిత్రాత్మక హ్యాండోవర్ కార్యక్రమానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచేందుకు గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి ఇప్పటికే గ్లాస్గో చేరుకున్నారు.
అహ్మదాబాద్ 2030 గేమ్స్ ఫస్ట్ ప్రివ్యూ
జెండా అప్పగింత (హ్యాండోవర్) కార్యక్రమంలో భాగంగా అహ్మదాబాద్ 2030 కామన్వెల్త్ గేమ్స్ మొదటి అధికారిక ప్రివ్యూను ప్రపంచానికి ప్రదర్శించనున్నారు. ఈ వీడియో ప్రదర్శన ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, అహ్మదాబాద్ నగరం చారిత్రక ప్రాధాన్యతను ప్రత్యేకంగా చూపించనున్నారు. అంతేకాకుండా ఈసారి 74 కామన్వెల్త్ దేశాల గుండా సాగే కింగ్స్ బ్యాటన్ రిలేలో సరికొత్త మార్పులు చేశారు. ఈ పోటీల్లో పాల్గొనే ప్రతి దేశం లేదా ప్రాంతానికి వారి స్వంత ప్రత్యేక బ్యాటన్‌ను అందించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
వందేమాతరం 150 ఏళ్ల ప్రత్యేక ప్రదర్శనలు
ముగింపు వేడుకల్లోని హ్యాండోవర్ విభాగాన్ని మూడు ప్రత్యేక విభాగాలుగా రూపకల్పన చేశారు. మొదటి విభాగంలో భారత జాతీయ గేయం వందేమాతరం రాసి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక వేడుకను నిర్వహించనున్నారు. రెండవ విభాగంలో భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు రుషభ్ రిఖీరామ్ శర్మ, స్కాటిష్ పైపర్ రోస్ ఐన్స్లీల మధ్య అద్భుతమైన ఇండియన్ క్లాసికల్ ప్రదర్శన ఉండనుంది. చివరి విభాగంలో భారత్, గుజరాత్ సంస్కృతిని ప్రతిబింబించేలా విజువల్ ప్రదర్శనలు ప్లాన్ చేశారు.
ముగింపు వేడుకలు ఎప్పుడు, ఎలా చూడాలి?
గ్లాస్గోలో జరగనున్న ఈ అత్యంత వైభవమైన ముగింపు వేడుకలు భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత, అంటే ఆదివారం తెల్లవారుజామున 1:30 గంటలకు ప్రారంభమవుతాయి. 2030లో అహ్మదాబాద్ వేదికగా జరగబోయే కామన్వెల్త్ గేమ్స్ తొలి ప్రివ్యూ చూడటానికి భారత క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.