
Viral Video : ఫుట్‌బాల్ ప్రపంచంలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. లా లీగా టోర్నమెంట్‌లో బార్సిలోనా, మల్లోర్కా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆటగాడు మరో ఆటగాడి ముఖంపై కాలు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనలో బార్సిలోనా గోల్ కీపర్ జోన్ గార్సియా తీవ్రంగా గాయపడగా, మల్లోర్కా స్ట్రైకర్ వేదాత్ మురిఖి రెడ్ కార్డ్‌తో మైదానం వీడాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
ఏం జరిగిందంటే..
మ్యాచ్ 36వ నిమిషంలో వేదాత్ మురిఖి బంతిని అందుకోవడానికి ప్రయత్నిస్తూ, ప్రమాదకరంగా తన కాలును పైకి లేపాడు. అది నేరుగా బార్సిలోనా గోల్ కీపర్ జోన్ గార్సియా ముఖానికి తగిలింది. మొదట ఆట కొనసాగినా వీఏఆర్ ద్వారా రీప్లే చూసిన తర్వాత రెఫరీ జోక్యం చేసుకున్నారు. ఫుటేజీలో వేదాత్ మురిఖి కావాలనే గోల్ కీపర్‌కు హాని కలిగించేలా ప్రవర్తించినట్లు తేలడంతో, అతడికి రెడ్ కార్డ్ చూపించి మైదానం నుంచి పంపించేశారు. ఈ ఘటన ఇటీవల కాలంలో లా లీగాలో జరిగిన అత్యంత ప్రమాదకరమైన ఫౌల్‌లలో ఒకటని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
గార్సియా ఏమన్నారంటే..
ఈ ఘటనపై జోన్ గార్సియా స్పందిస్తూ, “అతను నా ముఖంపై కొట్టాడు. అతను తన శరీరంలో ఏ భాగాన్ని ఉపయోగించాడో నాకు తెలియదు, కానీ నన్ను కొట్టాడు. వీఏఆర్ రివ్యూ తర్వాత రెఫరీ తన నిర్ణయాన్ని మార్చుకున్నారంటే, దానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది,” అని గార్సియా తెలిపారు.
విజయం సాధించిన బార్సిలోనా
మల్లోర్కా జట్టుకు ఇద్దరు ఆటగాళ్లు లేకపోవడం బార్సిలోనాకు కలిసొచ్చింది. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న బార్సిలోనా, ప్రత్యర్థి జట్టుపై 3-0తో విజయం సాధించింది. రాఫిన్హా, ఫెర్రాన్ టోర్రెస్, యంగ్ ప్లేయర్ లామిన్ యమాల్ ఒక్కో గోల్ సాధించి జట్టుకు విజయాన్ని అందించారు. ఆసక్తికరంగా, ఈ మ్యాచ్‌లో మరో ఆటగాడు మను మొర్లాన్స్ కూడా మల్లోర్కా తరఫున రెడ్ కార్డ్ అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ నుంచి లోన్‌పై వచ్చిన ఇంగ్లాండ్ ప్లేయర్ మార్కస్ రాష్‌ఫోర్డ్ కూడా బార్సిలోనా తరఫున అరంగేట్రం చేశాడు. అయితే అతడు గోల్ కొట్టే అవకాశాలు రాలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..