Mobile Addiction: ఒక్క రోజు మొబైల్ పక్కన పెట్టి ఉండగలరా? అందుకే ఈ-ఉపవాసం చేయండి అంటున్నారు ఆ ధార్మిక పెద్దలు.. ఎలా అంటే..

|

Sep 05, 2021 | 8:28 PM

చేతిలో మొబైల్ ఫోన్ లేని వ్యక్తిని ఇప్పుడు దాదాపు చూడలేము. వాట్సప్.. ట్విట్టర్ అంటూ పలకని పెదవులూ ఇంచుమించుగా మనకు కనబడవు.

Mobile Addiction: ఒక్క రోజు మొబైల్ పక్కన పెట్టి ఉండగలరా? అందుకే ఈ-ఉపవాసం చేయండి అంటున్నారు ఆ ధార్మిక పెద్దలు.. ఎలా అంటే..
Mobile Addiction
Follow us on

Mobile Addiction: చేతిలో మొబైల్ ఫోన్ లేని వ్యక్తిని ఇప్పుడు దాదాపు చూడలేము. వాట్సప్.. ట్విట్టర్ అంటూ పలకని పెదవులూ ఇంచుమించుగా మనకు కనబడవు. ఇంకా చెప్పాలంటే.. మెలకువలోనూ.. నిద్రలోనూ కూడా ఫోన్ రింగ్ టోన్ మన మదిలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఎంతలా అంటే.. పక్కన ఎక్కడో ఫోన్ రింగ్ అయినట్టు వినిపిస్తే..అది మనదేనేమో అని మన ఫోన్ చూసుకునేట్లుగా.. డిజిటల్ ప్రపంచంతో ఎడిక్ట్ అయిపోయారు అందరూ.. ఇప్పుడు మొబైల్ ఫోన్ అంటే అవసరమే కాదు.. అత్యవసర వ్యసనం కూడా అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే.. ఇష్టమైన వారితో మాట్లాడటానికే కాదు.. అత్యవసరమైన ఏదైనా వస్తువు కొనుక్కోవాలన్నా ఫోన్ కావలసిందే. అయితే, ఇదే ప్రపంచంగా మారిపోతోంది చాలా మందికి. పని ఉన్నా..లేకపోయినా..మొబైల్ ఫోన్ తోనే కాలక్షేపం చేసేస్తూ ఉంటున్నారు ఎక్కువ శాతం. ఒక్కో ఇంటిలో అయితే, నలుగురు ఉంటె.. నలుగురూ ఇంట్లో కలిసి టీవీ చూడటం కంటే.. ఎవరి ఫోన్ లో వారు ఎవరికీ ఇష్టమైన ప్రోగ్రాం వారు చూసుకుంటూ నాలుగు దిక్కులుగా మొహం పెట్టుకుని జీవించేస్తున్నారు. ఒకప్పుడు జీవితం యాంత్రికం అయిపోయిందిరా అనే వారు.. ఇప్పుడు లైఫ్ మొబైల్ మిషన్ అయిపొయింది బ్రో అనే పరిస్థితి వచ్చేసింది. ఇలా చెప్పుతూ పోతే.. ఇది ఎంతకీ తరగదు. కానీ ఈ విషయాన్ని చెప్పకపోతే.. ఇప్పుడు మీకు చెప్పబోయే విషయంలో డెప్త్ తెలియదు. అందుకే ఇంత చెప్పాల్సి వచ్చింది.

ఇప్పటివరకూ మనం చెప్పుకున్న విషయంలో ఇబ్బంది ఏమిటో తెలిసినా దానిని అంటే మొబైల్ ఫోన్ వ్యసనాన్ని వదలడానికి ఏమి చేయాలో మనకు తెలీడం లేదు. సరిగ్గా ఈ విషయం మీద జైన్ మతస్థులు ఒక పెద్ద ప్రయత్నం మొదలు పెట్టారు. అదే ఈ-ఉపవాసం. దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు ‘పర్యూషణ్ పర్వ్’ ఈ ఉపవాసం అంటేనే కొద్దిగా అర్ధం అయినట్టూ కానట్టూ ఉంది కదూ..మీ మనసులో అనిపిస్తున్నది నిజమే. మనం మామూలుగా ఉపవాసం అంటే.. ఆహారాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా వదిలిపెట్టి భగవంతుడికి దగ్గరగా ఉండడం. అదేవిధంగా జైన్ మతస్థులు ‘పర్యూషణ్ పర్వ్’ అంటే ఆత్మశుద్ధి కోసం చేసే ఆధ్యాత్మిక ప్రక్రియ. వీరి ఈ ప్రక్రియలో ప్రధానమైనది ఉపవాసం, త్యాగం. ఇప్పుడు దీనిని మొబైల్ ఫోన్ వ్యసనాన్ని తగ్గించే పనికి ముడిపెట్టారు వారు. ఇది ఈ నెల 3వ తేదీన ప్రారంభం అయింది. దీనిని ఈ నెల 11వ తేదీ వరకూ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మొబైల్ ఫోన్ల వినియోగాన్ని త్యాగం చేయాలని జైన ధార్మిక పెద్దలు నిర్ణయించారు. ఇందులో మొబైల్ ఫోన్లనే కాకుండా, ఇంటర్నెట్, ల్యాప్ టాప్స్, టీవీతో పాటు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు వంటి అన్నిటికీ దూరంగా ఉండాలన్న పెద్దలు.

ఈ కార్యక్రమానికి డిజిటల్(ఈ) ఉపవాసంగా జైన్ పెద్దలు పిలుపు ఇస్తున్నారు. ఈ సందర్భంగా అందరికీ వారు మొబైల్ ఫోన్లకు బానిస కాకుండా తమను తాము రక్షించుకోవాలని సూచిస్తున్నారు. ఈ-ఉపవాసం సందర్భంగా యువతకు జైన్ మత పెద్దలు 50 రోజుల ఛాలెంజ్ ప్రకటించారు. దీనికి వారు ‘ఎ మొబైల్ ఫోన్ ఈజ్ ఎ గుడ్ సర్వెంట్ బట్ ఎ డేంజరస్ మాస్టర్’. మీరు మొబైల్ ఫోన్ ను వినియోగించుకుంటే ఫర్వాలేదు. కానీ, ఆ ఫోన్ మిమ్మల్ని ఆజ్ఞాపిస్తే ప్రమాదకరం అని వారు అంటున్నారు. మొబైల్ ఫోన్ మీ నియంత్రణలో ఉంటె అది మంచి సేవకుడే అని ఆ పెద్దలు చెబుతున్నారు.

అందుకే రానున్న 50 రోజుల పాటు రోజులో 12 గంటలు మొబైల్ తదితర ఈ గాడ్జెట్లకు దూరంగా ఉండాలని సవాల్ చేస్తున్నారు యువతరానికి. ‘ఈ’ ఉపవాసంలో భాగంగా ప్రజలు తమ మొబైల్స్ తదిరత గాడ్జెట్లకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు దూరంగా ఉండాలని నిబంధన విధించారు. ప్రతి పన్నెండు గంటలకు గాను గంటకు ఒక పాయింట్ చొప్పున 12 పాయింట్లు కేటాయిస్తారు. ప్రతి పాయింట్ కూ ఒక రూపాయి చొప్పున ఇస్తారు. నిర్ణీత కాల వ్యవధి ముగిసిన తరువాత యువత సాధించిన పాయింట్ల ప్రకారం రూపాయలను వారి పేరుమీదుగా దానం చేస్తామని జైన్ పెద్దలు ప్రకటించారు.

అదండీ.. ఈ-ఉపవాసం కథ. జైన్ మత పెద్దలకు వచ్చిన ఈ ఆలోచన ప్రతి సమాజంలోనూ వచ్చి.. యువతను మొబైల్ ఫోన్ బానిసత్వం నుంచి దూరం చేసేలా ప్రోత్సహిస్తే భలే ఉంటుంది కదూ. మరి మీనుంచే ఆ ప్రయత్నం మొదలు పెట్టండి.

Also Read: Ganesh Chaturthi 2021: చవితి దగ్గరపడుతున్నా కనిపించని సందడి.. వేల కోట్ల రూపాయల వ్యాపారం ఆవిరి.. ఎందుకు ఇలా జరుగుతోంది..

Malladi Vishnu: ‘సోము వీర్రాజుకు మతి ఉండి మాట్లాడుతున్నారా.? ఇలాంటి డెడ్ లైన్లు చాలా చూశాం’: వైసీపీ నేతలు