CM KCR Attend Statue Of Equality Celebrations: ముచ్చింతల్‌లో సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బృహాత్తర కార్యక్రమం.. ఫిబ్రవరి 2 తేదిన ఆరంభమైన ఈ మహోత్సవం ఫిబ్రవరి 14 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. 13 రోజులపాటు జరిగే సహస్రాబ్ది సమారోహంలో భాగంగా యాగశాలలో జరగాల్సిన 1035 కుండాలతో శ్రీ లక్ష్మీనారాయణ యాగ కార్యక్రమం జరుగుతోంది. సహస్రాబ్ది సమారోహం వేడుకలో రెండో రోజు జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు.
చినజీయర్ స్వామి ఆశ్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ విచ్చేశారు. సమతా క్షేత్రంలో మహోత్కృష్టమైన సహస్రకుండాత్మక శ్రీ లక్ష్మీనారాయణ యాగ మహాక్రతువులో సీఎం పాల్గొంటారు. ఈ సందర్భంగా శ్రీరామనగరాన్ని పరిశీలించారు కేసీఆర్. 216 అడుగుల శ్రీరామానుజుల విగ్రహాన్ని ఆయన సందర్శించారు. సీఎం కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు రుత్వికులు. సీఎంతో పాటు చినజీయర్ స్వామి, మైహోమ్ అధినేత రామేశ్వరరావు ఉన్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నడుచుకుంటూ సెక్యూరిటీ సెంటర్‌కు వెళ్లారు. ఇలాంటి శాంతి సందేశం జాతికి, యావత్ దేశానికి అవసరమని సీఎం కేసీఆర్ అన్నారు. కాగా ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు కూడా పాల్గొన్నారు.
కాగా, ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరు కానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. సమీక్ష లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర,పోలీసు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. సమతామూర్తి విగ్రహ ప్రాంగణానికి ముందు పార్కింగ్ ఏరియాకు ఎదురుగా ఉన్న భవనంలో ఏర్పాటు చేసిన పోలీసుల కమాండ్ కంట్రోల్ రూంను సీఎం పరిశీలించారు.