
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రోజూ లక్షలాది మంది భక్తులు వెళుతుంటారు. స్వామివారి దర్శనం కోసం గంటలకొద్ది క్యూలైన్లలో వెయిట్ చేస్తూ ఉంటారు. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ రకాల టికెట్లు అందుబాటులో ఉంటాయి. స్లాటెడ్ సర్వ దర్శనం, సర్వ దర్శనం, రూ.300 టికెట్లు, దివ్యదర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం లాంటి అనేక మార్గాలు ఉన్నాయి. ఇక శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు ఇవ్వడం ద్వారా దర్శన అవకాశం కల్పిస్తారు. సాధారణ భక్తులు జయ, విజయ ద్వారం గుండా స్వామివారి దర్శనం చేసుకుంటారు. అదే విరాళం ఇచ్చినవారికి మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.
శ్రీవాణి ట్రస్టుకు రూ.10,500 విరాళంగా అందించాలి. రూ.10 వేలు ట్రస్ట్‌కు, రూ.500 దర్శనం టికెట్ కోసం తీసుకుంటారు. అయితే రూ.10,500 చెల్లించాల్సిన అవసరం లేకుండా కేవలం రూ.120తో మొదటి గడప నుంచే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ ఈ-డిప్ పద్దతి ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చు. ప్రతీ నెలా 18 నుంచి 20వ తేదీ వరకు లక్కీ డిప్ ఆప్షన్ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. ఏ రోజున విడుదల అవుతాయనేది టీటీడీ ముందే ప్రకటిస్తుంది. ఆ రోజు టీటీడీ వెబ్ సైట్, యాప్‌లోకి వెళ్లి శ్రీవారి ఆర్జిత సేవ(ఎలక్ట్రానిక్ డిప్) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం సెలక్ట్ అయిన వారికి మెస్సేజ్ వస్తుంది. రూ.120 రుసుం చెల్లిస్తే టికెట్ బుక్ అవుతుంది. ఏ రోజున టికెట్ బుక్ అయితే ఆ రోజు తిరుమల వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. అయితే ముందు నెలల ముందే ఈ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ నెలలో డిప్ వేస్తే.. సెప్టెంబర్‌లో దర్శనం ఉంటుంది.
ఇక ఆఫ్‌లైన్‌లో కూడా ఎలక్ట్రానిక్ డిప్ వేయవచ్చు. ఇందుకోసం తిరుమల కొండపై ఉండే సీఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వెళ్లాలి. అక్కడ బుకింగ్ కౌంటర్‌లో ఆప్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ డిప్ వేయాలి. సెలక్ట్ అయితే మెస్సేజ్ వస్తుంది. పేమెంట్ చేసిన తర్వాత రోజు మొదటి గడప నుంచే స్వామివారిని దర్శించుకోవచ్చు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దగ్గర నుంచి చూడాలనే కోరిక చాలామందికి ఉంటుంది. అలాంటివారు ఈ మార్గాల ద్వారా చూడవచ్చు.