చీపురును ఈ దిక్కున పెడుతున్నారా..? వాయమ్మో.. అంతా దరిద్రమే.. లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే..

Broom Placement Guide: ఇంట్లో చీపురు కట్టను సరైన ప్రదేశంలో ఉంచడం ద్వారా అదృష్టం, లక్ష్మీదేవి కటాక్షం లభిస్తాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇంట్లోని చెత్తతో పాటు మన జీవితంలోని ప్రతికూలతలను తొలగించే సాధనంగా చీపురును పరిగణిస్తారు. చీపురును అజాగ్రత్తగా పారవేయడం లేదా అశుభ్రమైన ప్రదేశాల్లో ఉంచడం తగదని పేర్కొంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు..

చీపురును ఈ దిక్కున పెడుతున్నారా..? వాయమ్మో.. అంతా దరిద్రమే.. లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటే..
Broom Vastu

Updated on: May 19, 2026 | 11:15 AM

వాస్తుశాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఉపయోగించే ప్రతి వస్తువుకూ ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అందులో చీపురు కట్టకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంట్లోని చెత్తను తొలగించడమే కాకుండా, మన జీవితంలోని ప్రతికూలతలను, అవాంతరాలను దూరం చేస్తుందని నమ్ముతారు. అందుకే.. సనాతన ధర్మంలో చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇది ఇల్లు శుభ్రం చేసి, దారిద్ర్యాన్ని తొలగిస్తుందని నమ్ముతారు. అయితే, ఈ చీపురు కట్టను ఎలా, ఎక్కడ ఉంచాలి అనే దానిపై చాలా మందికి సరైన అవగాహన ఉండదు. చాలా ఇళ్లలో చీపురును ఇష్టం వచ్చినట్లు పారవేయడం లేదా అశ్రద్ధగా ఉంచడం గమనించవచ్చు. ఇది ఇంట్లో దరిద్రానికి కారణమవుతుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చాలా మంది తెలియకుండానే చీపురును ఈశాన్యం మూల (నార్త్-ఈస్ట్) ఉంచుతారు. ఈశాన్యం అత్యంత పవిత్రమైన దిక్కు.. ఈ దిక్కులో భగవంతుడు, ఈశ్వరుడు, సకల దేవతలు కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి పవిత్రమైన స్థలంలో చీపురును ఉంచడం వల్ల దరిద్ర దేవత తాండవిస్తుందని, ఇంటికి అరిష్టం కలుగుతుందని వాస్తు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈశాన్యం మూల చీపురును ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది.

కొందరు చీపురు కట్టను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి, ఎక్కడైనా పెట్టొచ్చు అని వాదిస్తుంటారు. చీపురు నిజంగా లక్ష్మీదేవి స్వరూపమే అయినప్పటికీ, దానిని ఎలా ఉపయోగించాలో, ఎక్కడ ఉంచాలో తెలుసుకోవడం ముఖ్యం అని సూచిస్తున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.. దైవత్వం కొలువై ఉండే పవిత్ర స్థలంలో చీపురును పెట్టడం తప్పు. దీనిపై వితండవాదం చేయడం వల్ల నష్టపోయేది మనమే తప్ప, చెప్పే వారికి ఎటువంటి నష్టం ఉండదని గుర్తుంచుకోవాలంటున్నారు.

ఇంట్లో చీపురును ఏ దిక్కున పెట్టాలి..

ఇంట్లో చీపురు కట్టను వాయువ్య మూల (నార్త్-వెస్ట్) లేదా ఆగ్నేయ మూల (సౌత్-ఈస్ట్) ఉంచడం చాలా శుభప్రదం. ఈ దిక్కుల్లో చీపురును భద్రపరచడం వల్ల ఇంట్లో అదృష్టం వృద్ధి చెందుతుంది. నైరుతి మూల (సౌత్-వెస్ట్) కూడా చీపురును పెట్టవద్దని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఈశాన్యం, నైరుతి మూలల్లో చీపురును ఉంచడం దరిద్రానికి హేతువుగా పరిగణిస్తారు.

ఇంటి పనులను జాగ్రత్తగా చూసుకునే ఇల్లాలు చీపురు కట్టను పద్ధతిగా, జాగ్రత్తగా చూసుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవికి కొదవ ఉండదని నమ్ముతారు. దరిద్రం రావడానికి పుట్టిన తేదీ, వివాహ తేదీ, ఇంట్లోకి ప్రవేశించిన దిశలు లేదా పేరు వంటి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. అయినప్పటికీ, చీపురు కట్టను ఈశాన్యం లేదా నైరుతి మూలల్లో పెట్టకూడదు అనే నియమం అత్యంత కీలకమైనది. వాయువ్య లేదా ఆగ్నేయ దిశల్లో, ఊడ్చే కుచ్చు కిందకు, పట్టుకునే కుచ్చు పైకి ఉండేలా చీపురును ఉంచితేనే అదృష్టం లభిస్తుంది. ఈ సూచనలను పాటించి, మీ జీవితంలో సానుకూల మార్పులను పొందవచ్చంటున్నారు వాస్తు నిపుణులు..

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం.. మతం, జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us