అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక రహస్యం ఇదే!

Ambaji Temple Mystery Telugu: గుజరాత్‌లోని అంబాజీ ఆలయం ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలకు ప్రసిద్ధి. ఇక్కడ అమ్మవారి విగ్రహానికి బదులుగా వీసా యంత్రాన్ని పూజిస్తారు. గబ్బర్ కొండ, అఖండ జ్యోతి, శక్తిపీఠం వెనుక ఉన్న పురాణ విశ్వాసాలు ఈ క్షేత్రాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక రహస్యం ఇదే!
Ambaji Temple Mystery Telugu

Updated on: Sep 26, 2026 | 9:57 PM

Ambaji Temple Mystery Telugu: భారతదేశంలో అనేక చారిత్రక దేవాలయాలున్నాయి. ఒక్కో దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత, చారిత్రక నేపథ్యం ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ప్రత్యేక ఆలయం గురించి మనం తెలుసుకోబోతున్నా. గుజరాత్‌లోని బనాస్‌కాంతా జిల్లాలో, రాజస్థాన్ సరిహద్దుకు సమీపంలో అరవళ్లి, అరాసూర్‌ పర్వతాల మధ్య కొలువైన పవిత్ర క్షేత్రమే అంబాజీ ఆలయం. సముద్ర మట్టానికి సుమారు 480 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి అందాలకు మాత్రమే కాదు.. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి కూడా ప్రతీకగా నిలుస్తోంది. అంబాజీ ఆలయంలో అడుగుపెట్టగానే పర్వతాల ప్రశాంతత, ఆలయ గంటల నాదం, ధూప సుగంధం భక్తులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి.

శక్తిపీఠంగా అంబాజీకి ప్రత్యేకత

అంబాజీ ఆలయానికి ఎంతో ప్రాచీనమైన శక్తి ఆరాధన సంప్రదాయం ఉందని విశ్వసిస్తారు. ఇక్కడి అమ్మవారిని ‘అరాసురి అంబా’ అని కూడా పిలుస్తారు. పురాణ కథనం ప్రకారం.. దక్షుడు నిర్వహించిన యజ్ఞంలో తన భర్త పరమశివుడికి జరిగిన అవమానాన్ని భరించలేక సతీదేవి యజ్ఞాగ్నిలో తన దేహాన్ని త్యాగం చేసింది. దీంతో తీవ్ర విషాదానికి గురైన శివుడు సతీదేవి దేహాన్ని భుజాన వేసుకుని తాండవం చేయగా, సృష్టి సమతుల్యతను కాపాడేందుకు శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రంతో ఆమె దేహాన్ని వివిధ భాగాలుగా చేశాడని పురాణాలు చెబుతాయి.

సతీదేవి శరీర భాగాలు, ఆభరణాలు పడిన ప్రాంతాలు శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. అంబాజీ క్షేత్రంలో సతీదేవి హృదయం లేదా ఆమె మూలశక్తి అంశం వెలసిందని స్థానిక విశ్వాసం. అందుకే ఈ క్షేత్రాన్ని అత్యంత పవిత్రమైన శక్తి ఆరాధనా కేంద్రంగా భక్తులు భావిస్తారు.

ఇవి కూడా చదవండి

విగ్రహం లేని ఆలయం.. యంత్రానికే పూజ

అంబాజీ ఆలయంలోని అత్యంత ప్రత్యేకత అమ్మవారి విగ్రహం లేకపోవడమే. సాధారణంగా దేవాలయాల్లో విగ్రహాన్ని దర్శించి పూజలు చేస్తారు. కానీ ఇక్కడ గర్భగుడిలో ‘శ్రీ వీసా యంత్రం’నే అమ్మవారి స్వరూపంగా భావించి పూజిస్తారు. ఆ యంత్రాన్ని నేరుగా చూడకుండా ప్రత్యేకమైన ఆచారాలను పాటిస్తూ పూజలు నిర్వహిస్తారు. శాక్త సంప్రదాయంలో దైవశక్తిని కేవలం ఒక రూపానికే పరిమితం చేయకుండా నిరాకార శక్తిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో అంబాజీలో యంత్రారాధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని భక్తులు విశ్వసిస్తారు. రూపం కనిపించకపోయినా.. ఆధ్యాత్మిక శక్తిని అనుభవించడమే ఇక్కడి ఆరాధనలోని అంతరార్థంగా భావిస్తారు.

గబ్బర్ కొండ.. అఖండ జ్యోతి

అంబాజీ యాత్ర గబ్బర్ కొండ దర్శనంతో మరింత సంపూర్ణమవుతుందని భక్తుల నమ్మకం. ఆలయానికి సమీపంలోని ఈ కొండను అమ్మవారి మూలస్థానంగా భావిస్తారు. ఇక్కడ అమ్మవారి పవిత్ర పాదముద్రలను దర్శించవచ్చు. గబ్బర్ శిఖరంపై వెలిగే అఖండ జ్యోతి కూడా భక్తులకు ఎంతో ప్రత్యేకం. ఈ జ్యోతిని అమ్మవారి దివ్య సాన్నిధ్యానికి, ఆశకు, విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు.

భాద్రపద పౌర్ణమి.. భక్తుల మహాయాత్ర

అంబాజీలో ఏడాది పొడవునా భక్తుల రద్దీ కనిపించినా.. భాద్రపద పౌర్ణమి సందర్భంగా జరిగే మహామేళాకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. గుజరాత్‌, రాజస్థాన్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కాలినడకన అంబాజీకి చేరుకుంటారు. చేతుల్లో ఎర్రటి జెండాలు, నోట ‘జై అంబే’ నామస్మరణతో సాగిపోయే ఈ పాదయాత్ర భక్తి, సంకల్పం, ఆధ్యాత్మిక తపస్సుకు ప్రతీకగా కనిపిస్తుంది.

మోహన్‌థాళ్ ప్రసాదం ప్రత్యేకత

అంబాజీ ఆలయంలో లభించే మోహన్‌థాళ్ ప్రసాదం కూడా ఎంతో ప్రసిద్ధి. శనగపిండి, నెయ్యి, చక్కెరతో తయారు చేసే ఈ సంప్రదాయ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి భక్తులకు అందిస్తారు. అంబాజీ కేవలం ఒక ఆలయం కాదు.. చరిత్ర, పురాణం, సంప్రదాయం, భక్తి, ఆధ్యాత్మికత కలిసిన పవిత్ర క్షేత్రం. ఇక్కడ అమ్మవారి రూపాన్ని చూడటమే కాకుండా.. నిరాకార శక్తిని అనుభవించడమే అసలైన ఆధ్యాత్మిక అనుభూతిగా భక్తులు భావిస్తారు.

(Disclaimer: ఈ కథనంలోని పురాణ, ఆధ్యాత్మిక అంశాలు సంప్రదాయాలు, స్థానిక విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి. వీటిని భక్తి దృష్టితో చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Loading...
Unable to load recommendations.
Follow Us