
కలబందలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. ఇది పలు సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. కలబందకు.. హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన, శుభప్రదమైన స్థానం ఉంది. ఇది లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అంతేకాకుండా.. కలబందను పెంచడం వల్ల దుష్టశక్తులు, దిష్టి తొలగిపోతుందని నమ్ముతారు.. కలబంద మొక్కను మీ ఇంట్లో సరైన దిశలో ఉంచడం ద్వారా మీ అదృష్టం మారి, ధన వర్షం కురుస్తుందని తరతరాలుగా నమ్మకం. ఆధునిక కాలంలో చర్మం, జుట్టు సంరక్షణకు కలబందను విరివిగా ఉపయోగిస్తున్నప్పటికీ, ఇది ఇంటికి పాజిటివ్ ఎనర్జీని పెంచి, నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. చెడు దృష్టి, నర దృష్టి, నరఘోష, నకారాత్మక శక్తుల నుండి కలబంద మొక్క ఇంటిని రక్షిస్తుంది. ఈ మొక్కకు కొద్దిపాటి నీరు, సూర్యరశ్మి ఉంటే చాలు, చక్కగా గుబురుగా పెరుగుతుంది. ఇది సానుకూలతకు గొప్ప మూలం..
వాస్తు శాస్త్ర నిపుణులు, పండితుల ప్రకారం.. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ భాగవతంలోని దశమస్కందంలో వృక్షాల గొప్పదనాన్ని బలరాముడికి వివరించారు. చెట్లు ఎవరికీ హాని చేయవని, వర్షాకాలంలో వర్షాలు సకాలంలో కురిసేలా చేస్తాయని, పనికిరాని మొక్క అంటూ ఏదీ ఉండదని ఆయన పేర్కొన్నారు. ప్రతి వృక్షం మానవులకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతూనే ఉంటుందని, వృక్షాలు మానవులకు దైవంతో సమానమని శ్రీకృష్ణుడు తెలిపారు. వృక్షాలు ప్రాణవాయువును విడుదల చేసి, చెడు గాలిని పీల్చుకుంటూ మన ప్రాణాల్ని నిలబెడతాయని వివరించారు. చెట్లను ఎవరు ఇంట్లో పెంచుకుంటారో, అక్కడ తాను భూలోకంగా కొలువై ఉంటానని శ్రీకృష్ణుడు చెప్పినట్లు పురాణాలు పేర్కొన్నాయి.
కలబంద మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఆయుర్వేదంలో దీనికి విశిష్ట స్థానం ఉంది. కలబంద మొక్కను 33 కోట్ల దేవతల రూపంగా కొలుస్తారు. ఈ మొక్క అంచులు ముళ్ళతో నిండి ఉంటాయి, ఒక్కొక్క ముల్లు ఒక్కొక్క దేవతకు అధిష్టానంగా ఉంటుందని మన శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి. అందుకే కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకుంటే 33 కోట్ల దేవతలు ఇంట్లో ఉన్నట్లేనని విశ్వసిస్తారు. కలబంద గుజ్జును పరగడుపున తీసుకుంటే ఎన్నో రోగాలకు మందుగా పని చేస్తుందని, ఆవుపాలలో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారని కూడా నమ్మకం. కలబంద మొక్కలో త్రిమూర్తులు సహా అందరు దేవతలు కొలువై ఉంటారు. ఏ ఇంట్లో కలబంద మొక్క ఉంటుందో, ఆ ఇంట్లో సిరిసంపదలకు లోటు ఉండదని, అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో ఆ ఇల్లు తొలతూగుతుందని చెప్పబడింది.
కలబంద మొక్కను సరైన దిశలో పెడితేనే దాని వల్ల ఎక్కువ లాభాలు కలుగుతాయి. ప్రతి నెల అమావాస్య రోజున వేళ్ళతో సహా ఒక కలబంద మొక్కను తెచ్చుకుని, శుభ్రంగా కడిగి, దేవుని పాదాల వద్ద పసుపు, కుంకుమ, చందనంతో అలంకరించి, అగరబత్తి, సాంబ్రాణితో ధూపం వేయాలి. పసుపు, కుంకుమ నెగటివ్ ఎనర్జీని దూరం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. అమావాస్య రోజంతా దేవుని దగ్గర ఉంచిన కలబంద మొక్కను పాడ్యమి గడియలు ప్రారంభమైన తర్వాత ఇంటి గుమ్మానికి కుడి వైపు దారం సహాయంతో కట్టాలి. ఇలా ప్రతి నెలా మొక్కను మార్చుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి వచ్చే చెడు దృష్టి, ప్రతికూల ఆలోచనలు గ్రహించి, ఇంట్లో ఎటువంటి చెడు జరగకుండా అడ్డుకుంటుంది.
కలబంద మొక్క ఎక్కువగా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. ఇంటి గుమ్మం దగ్గర ఉంచడం వల్ల చెడు వాయువులను తగ్గించి, స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తుంది. కలబంద మొక్కను ఎల్లప్పుడూ ఇంటి ఈశాన్య ప్రదేశంలో ఉంచాలి. మొక్క వేళ్ళను పైకి వేలాడదీసి, మొదలును క్రిందికి వేలాడతీయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులు నశిస్తాయి. భార్యాభర్తల మధ్య అనుబంధ సమస్యలు, ఆర్థిక సమస్యలు, వాస్తు దోషాలు వంటి ఎటువంటి సమస్యలనైనా కలబంద మొక్క పరిష్కారం చూపుతుంది. బయట నుండి ఇంట్లోకి వచ్చే చెడు శక్తులు, గ్రహాల నుండి కలబంద మొక్క మనల్ని రక్షిస్తుంది. ఈ విధంగా కలబంద మొక్కను ఏర్పాటు చేసుకుంటే తప్పకుండా శుభమే జరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..