భాగ్యనగరంపై మళ్లీ పంజా విసురుతోంది…

హైదరాబాద్ మహానగరంపై మహమ్మారి మళ్లీ ప్రతాపం చూపుతోంది. భాగ్యనగరం మళ్లీ డేంజర్‌ జోన్‌లోకి వెళుతోంది. లాక్‌డౌన్‌ సమయంలో భారీగా తగ్గిన..

భాగ్యనగరంపై మళ్లీ పంజా విసురుతోంది...
Follow us

|

Updated on: Aug 30, 2020 | 3:30 PM

హైదరాబాద్ మహానగరంపై మహమ్మారి మళ్లీ ప్రతాపం చూపుతోంది. భాగ్యనగరం మళ్లీ డేంజర్‌ జోన్‌లోకి వెళుతోంది. లాక్‌డౌన్‌ సమయంలో భారీగా తగ్గిన కాలుష్యం ఇప్పుడు అనూహ్యంగా పెరిగిపోయింది. హైదరాబాద్‌లో కాలుష్యం ఢిల్లీతో పోటీ పడుతోందని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ తాజా అధ్యయనంలో వెల్లడైంది.

మోటార్‌ వాహనాల ద్వారా హైదరాబాద్‌లో వాయు కాలుష్యం పెరిగిపోతోంది. వాహనాల నుంచి వెలువడే నైట్రోజన్‌ డయాక్సైడ్‌ కాలుష్యంతో వాతావరణశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలో 77 శాతం వాయు కాలుష్యం పెరిగితే, ఢిల్లీలో 49 శాతం, హైదరాబాద్‌లో 40 శాతం, బెంగళూరులో 38 శాతం వాయుకాలుష్యం పెరిగిందని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ తాజా అధ్యయనంలో వెల్లడైంది.

మార్చి 22 నుంచి మే మూడో వారం వరకు లాక్‌డౌన్‌ సమయంలో హైదరాబాద్‌లో వాయు కాలుష్యం భారీగా తగ్గిపోయింది. అయితే లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించాక, రోడ్ల మీదకి మళ్లీ వాహనాల రాక మొదలైంది. దీంతో వాయు కాలుష్యం పెరిగిపోయింది. లాక్‌డౌన్‌లో హైదరాబాద్‌ నుంచి సొంత ఊర్లకు వెళ్లినవారు తిరిగి వచ్చారని, ఆ తర్వాత రోడ్ల మీదకి యధావిధిగా వాహనాలు రావడంతో వాయు కాలుష్యం పెరిగిపోయిందని నగరవాసులు చెబుతున్నారు. అయితే వైరస్‌పై అలర్ట్‌గా ఉండాలని, అత్యవసరం అయితేనే తప్ప బయటకి రాకుండా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాగా, కరోనా వైరస్‌ వల్ల చాలా మంది సొంత వాహనాల్లో ప్రయాణం చేయడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతోందని కొందరు స్థానికులు భావిస్తున్నారు.

మార్చి 27 నుంచి మే 17 వరకు వాయు కాలుష్యం తగ్గిందని, ఇప్పుడు మళ్లీ పెరిగిందంటున్నారు తెలంగాణ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ అధికారులు. అయితే మిగతా నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో వాయు కాలుష్యంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ప్రతి పౌరుడు స్వీయ నియంత్రణ పాటించినప్పుడే వైరస్‌తో పాటు ఇటు వాయు కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చని సూచించారు.