మూడు ప్రెస్ మీట్‌లు..ఆరు ఆరోపణలు.. ఏపీలో రాజకీయ కాక

ఊరంతా ఒక దారి. ఉలిపికట్టెది మరో దారిలా ఉంది ఏపీ రాజకీయం. కరోనాతో అంతా లాక్ డౌన్ అయింది. ఫలితంగా అంతా ఇళ్లు, ఊళ్లకే పరిమితం. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇందుకు విరుద్దమైన పరిస్థితి. నడి వేసవిలో రాజకీయ వేడి రగలుతోంది. అధికార, ప్రతిపక్షాల నేతలెవరు తగ్గడం లేదు. అట్టు పెడితే అట్టున్నర పెట్టేలా ఉంది వారి తీరు. రాబోయే రోజుల్లో కరోనాతో కలసి జీవించాల్సి రావచ్చన్నారు సీఎం వైఎస్‌ జగన్. ఆ మాటలు టీడీపీకి నచ్చలేదు. ప్రజలందరికీ […]

మూడు ప్రెస్ మీట్‌లు..ఆరు ఆరోపణలు.. ఏపీలో రాజకీయ కాక
Follow us

|

Updated on: Apr 30, 2020 | 7:48 PM

ఊరంతా ఒక దారి. ఉలిపికట్టెది మరో దారిలా ఉంది ఏపీ రాజకీయం. కరోనాతో అంతా లాక్ డౌన్ అయింది. ఫలితంగా అంతా ఇళ్లు, ఊళ్లకే పరిమితం. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇందుకు విరుద్దమైన పరిస్థితి. నడి వేసవిలో రాజకీయ వేడి రగలుతోంది. అధికార, ప్రతిపక్షాల నేతలెవరు తగ్గడం లేదు. అట్టు పెడితే అట్టున్నర పెట్టేలా ఉంది వారి తీరు. రాబోయే రోజుల్లో కరోనాతో కలసి జీవించాల్సి రావచ్చన్నారు సీఎం వైఎస్‌ జగన్. ఆ మాటలు టీడీపీకి నచ్చలేదు. ప్రజలందరికీ కరోనా రావాలని కోరుకుంటున్నారా అంటూ మండిపడింది. ఇదే చాన్స్. ఒక వర్గం మీడియా దాన్ని భూతద్దంలో చూపింది. పదే పదే ఆ వార్తను ప్రసారం చేసింది.

సోషల్ మీడియాలోను ప్రచారమైంది. మరోవర్గం మీడియా మాత్రం జగన్ నిజమే చెప్పారంటోంది. ఇదే కాదు..వైఎస్ఆర్ కాంగ్రెస్, విపక్షాల మధ్య మాటల తూటాలు కరోనా వేళకూడ తగ్గడం లేదు. ఇంకా పెరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అసలు ఇంటి నుంచి బయటకు రావడం లేదు. పక్క రాష్ట్రంలో ఉంటున్నాడంటూ వైసీపీ నేతల చేస్తున్న విమర్శకు టీడీపీ నుంచి సమాధానం లేదు. సిఎం జగన్ క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు రావడం లేదని ఎదురుదాడి చేసే యత్నాలు మినహా ఏమి ఉండటం లేదు. వారి మాటల యుద్ధం చూస్తుంటే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయా అన్నట్లుగా ఉంది. ప్రతిదీ విమర్శించడం టీడీపీ, విపక్షాలకు అలవాటుగా మారగా..తప్పు చేసినా తిప్పికొట్టడం వైసీపీకి రివాజుగా మారింది. ఇదే సమయంలో అధికార పార్టీ నేతల తీరు విపక్షాలకు ఆయుధంగా మారుతోంది.

నవ్విపోదురుగాక…

కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫాలు మర్కజ్ కు వెళ్లి వచ్చారనే ఆరోపణలతో మొదలైన విమర్శల పర్వం ఇంకా కొనసాగుతోంది. తాము అక్కడకు వెళ్లలేదని చెబుతున్నా…విమర్శల దాడి తగ్గలేదు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధనరెడ్డి భారీ కటౌట్లు పెట్టి మరీ ప్రచారం, నగరిలో వైసీపీ నేత రోజా కుళాయిల ఓపెనింగ్, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో 30 ట్రాక్టర్ల నిండా సరుకులు వేసుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే కిలివేటి ప్రారంభించడం విమర్శలకు తావిచ్చింది.

ఎంపీ, ఎమ్మెల్యేలు భౌతిక దూరం పాటించకుండా కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారనే విమర్శలు వచ్చాయి. ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్ కర్నాటకకు వెళ్లి పెద్ద ఎత్తున అనుచరులతో తిరిగి రావడం, చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ ఈనెల 3న వి కోటలోని భరత్ నగర్ కు వెళ్లి చిన్న వంతెనను ప్రారంభించడం విమర్శలకు తావిచ్చింది. ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో ఎక్కువ రోజులు గడపడాన్ని టీడీపీ తప్పు పట్టింది. భౌతిక దూరాన్ని పాటించకుండా ఇవన్నీ చేస్తున్నారని ఆరోపించింది. ‌ కరోనా ధాటితో అంత భౌతిక దూరం పాటిస్తున్నారు. కానీ అమరావతి కోసమంటూ కొందరు టీడీపీ కార్యకర్తలు ఇప్పటికీ రాజధాని గ్రామాల్లో మౌన దీక్ష చేయడం వెనుక టీడీపీ రాజకీయ వ్యూహం ఉందనే వాదనుంది. అంతే కాదు. కరోనా బాధితులను ఆదుకోవడంలో వైసీపీ సర్కార్ విఫలమైందంటూ టీడీపీ జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో దీక్షలు చేసింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇంట్లోనే ఉండి చేసిన 12గంటల దీక్షలు చేసింది. ఇప్పుడు వ్యూహం మారుతోంది. మండల స్థాయిలో కూడా ఈ దీక్షలు చేయాలని నిర్దేశించారు. జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో స్థానిక ప్రజలు, రైతులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ఆలోచన చేస్తోంది. స్థానిక ఎన్నికల్లో ఓట్ల కక్కుర్తితో అధికార నేతలు గుంపులుగా తిరగడం వల్లే రాష్ట్రంలో కరోనా ఉధృతమైంది. కర్నూలు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు తదితర జిల్లాలను ప్రమాదంలోకి నెట్టారనే ఆరోపణలు చేస్తున్నాయి విపక్షాలు.

పరువు తీసిన అనకాపల్లి ఎంపీ

రేషన్‌ బియ్యం దారిమళ్లింపు వ్యవహారంలో అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ సత్యవతికి చెందిన ట్రస్ట్‌పై కేసు నమోదైంది. ఇందుకు బాధ్యులైన రేషన్ డీలర్‌, ఎంఎల్‌ఎస్‌పీ ఇన్‌ఛార్జి సస్పెన్షన్ కు గురయ్యారు. తన పుట్టినరోజు సందర్భంగా పేదలకు పంపిణీ చేసేందుకు రేషన్‌ డిపో డీలర్ల సంఘం నుంచి చౌక బియ్యం తీసుకున్నారని అనకాపల్లి ఎంపీ సత్యవతి పై ఆరోపణలు వచ్చాయి. బియ్యం అన్‌లోడ్‌ జరిగిన కల్యాణ మండపం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న వివేకానంద ట్రస్ట్‌ (ఎంపీ కుటుంబసభ్యులది)పై పోలీస్‌ కేసు రావడం వైసీపీ నేతలను ఇరుకున పెట్టింది. చౌక బియ్యం అన్‌లోడ్‌ చేస్తుండగా సీపీఎం నేతలు పట్టుకోవడం ఆ తర్వాత మీడియాలో ప్రచారం కావడంతో గుక్క తిప్పుకోలేని పరిస్థితి తయారైంది.

వాలంటీర్లు లేకున్నా కేరళలో ఇంటింటికీ 17 రకాల సరుకులు పంపిణీ జరుగుతోంది. ఏపీలో వాలంటీర్లకు రూ.4వేల కోట్లు వేతనాలు చెల్లిస్తూ కూడా, ఇంటింటికీ రేషన్‌ సరుకులు పంపిణీ చేయడం లేదని విమర్శిస్తోంది తెలుగుదేశం పార్టీ. రైతు భరోసా నుంచి ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే 32వేలమంది పేర్లు తీసేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలమందిని తీసేశారని టీడీపీ వాదిస్తోంది. కరోనా పేరుతో వ్యాపారులను బెదిరించి నేతలు వసూళ్లు చేస్తున్నారు. కరోనా అధికార నాయకులకు ఏటీఎంగా మారిందని టీడీపీ సర్వసభ్య సమావేశం ధ్వజమెత్తింది. వైసీపీ నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరించి, లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం ద్వారా సూపర్‌ స్ర్పెడర్లుగా మారరానే విషయాన్ని ప్రచారంలోకి తీసుకు వచ్చే వ్యూహం చేస్తోంది. మరోవైపు కరోనా కట్టడిలో దేశంలోనే ఏపీ ఫస్ట్. పరీక్షల్లోను ఏపీనే టాప్ అని చెబుతోంది వైసీపీ సర్కార్.

లేఖల రాజకీయం…

మాజీ సిఎం చంద్రబాబు నాయుడు లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి హైదరాబాద్ కే పరిమితమయ్యారు. సిఎం, గవర్నర్, సిఎస్, వివిధ శాఖల అధికారులకు లేఖలు రాస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు లేఖలు రాస్తున్నారు. ఫించన్లు, పొగాకు కొనుగోళ్లు, పిపిఇ కిట్స్ కొనుగోళ్లు, రైతులకు గిట్టుబాటు ధరలు, వలస కూలీలను ఆదుకోవాలని, |ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులు, మత్స్యకారుల తరలింపు, కరోనా బాధితులకు అందిస్తున్న సేవల పై ఈ లేఖలు ఎక్కువగా ఉన్నాయి. ఫలితంగా ఆయన లేఖలకే పరిమితమయ్యారు. ఇందుకు భిన్నంగా ఉంది లోకేష్ తీరు. ట్విట్టర్ వేదికగా రోజుకో రకంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వం పై విమర్శలు సంధిస్తున్నారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి తన అక్కసును వెళ్లగక్కేలా ఉంది ట్విట్టర్ వార్. మరోవైపు వైసీపీ దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. ఎవరికి వారే సోషల్ మీడియా వేదికగా ఆరోపణల పర్వం సాగిస్తున్నారు.

అక్రమ మద్యం, ఇసుక తవ్వకాలు, పలు క్వారంటైన్లలో ఆకలి కేకలు వంటి వాటి పై టీడీపీ దృష్టి పెట్టింది. రాజధాని తరలింపు, ఎల్పీ సుబ్రమణ్యం తొలగింపు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో మరొకరు నియామకం వంటి విషయాల పై టీడీపీ, బీజేపీ, జనసేన, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు దృష్టి పెట్టాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటికే పరిమితమయ్యారు. ఇక సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. కూలీల వద్దకు వెళుతు, వారిని ఆదుకోవాలని కోరుతున్నారు. సిపిఐ నారాయణ చెప్పినట్లే రామకృష్ణ తమ పార్టీ పై విమర్శలకు దిగుతున్నారని..వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి వంటి వారు చెప్పడం ఆసక్తికరం.

ప్రెస్ మీట్ లు…

కరోనా ప్రభావంతో ప్రెస్ మీట్ లకు పెద్దగా వెళ్లడం లేదు మీడియా ప్రతినిధులు. ఫలితంగా జూమ్ యాప్ ద్వారా టీడీపీ నేతలు లైవ్ లు ఇస్తున్నారు. వాటి లింక్ లు మీడియా వారికి పంపడం ఇప్పుడు జరుగుతోంది. రోజు మూడు నుంచి నాలుగు ప్రెస్ మీట్ లు ఇటు టీడీపీ, అటు వైసీపీలు పెడుతున్నాయి. అధికార పార్టీని విమర్శిస్తు టీడీపీ, ఎదురు దాడి చేస్తూనే..తాము చేసిన, చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది వైసీపీ సర్కార్. చంద్రబాబు ఇంటి నుంచే ప్రెస్ మీట్ లు పెడుతుండగా..సిఎం జగన్ క్యాంప్ కార్యాలయం నుంచే ఆపని చేస్తున్నారు. ఫలితంగా ఎవరికి వారే ఆరోపణల పర్వం సాగిస్తుండటం కొత్త ట్రెండ్. స్థానిక ఎన్నికలు వాయిదా పడటం పోటీ చేసిన అభ్యర్థుల పుట్టి ముంచుతోంది.

ఆర్థికంగా వారు నష్టపోతున్నారు. తమకు బియ్యం లేవని, పప్పు ఉప్పులు లేవని నేతలను అడిగే పేదలు ఎక్కువయ్యారు. ఫలితంగా అప్పుచొప్పో చేసి ఇవ్వాల్సి వస్తోంది. లేకపోతే లాక్ డౌన్ తర్వాత వారు తమకు వారు ఓటెయ్యరనే భయం పట్టుకుంది వారికి. అందుకే తల తాకట్టు పెట్టైనా సరే ఏదో ఒకటి ఇచ్చుకుంటూ ముందుకు నడుస్తున్నారు. లాక్ డౌన్ ఇంకా కొనసాగితే వారు నిండా మునిగినట్లే.  కరోనా వేళ మిగతా రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు కాస్త సంయమనం పాటిస్తుండగా..ఏపీలో ఇందుకు విరుద్దమైన రాజకీయాలు ఉండటం చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా రాజకీయాలు మాని ఎవరి బాధ్యతను వారు గుర్తెరిగి ప్రవర్తించాలంటున్నారు ఇంకోవైపు ఓటేసిన జనాలు. మరి పొలిటికల్ పార్టీలు ఏమంటారో చూడాలి.

-కొండవీటి శివనాగ్ రాజు సీనియర్ జర్నలిస్టు, టీవీ-9.

Read this: ప్రసాదాలలో విషం.. ఉగ్రకుట్రకు తీహార్‌లో స్కెచ్

Read this: కరోనా కేసుల సంఖ్యపై అనుమానాలు.. కేసీఆర్ స్పందించాలన్న ఉత్తమ్

Read this: పరిణయోత్సవాలపై టీటీడీ సంచలన నిర్ణయం

Read this: అంత్యక్రియలు అడ్డుకుంటే అలా చేయండి.. డీజీపీకి జగన్ డైరెక్షన్

Read this: ఒకే గదిలో 40 మంది.. తెలుగోళ్ళ ‘మహా’ కష్టం

Read this: పార్లమెంటు నిర్మాణం వద్దంటే షాకే..!

Read this: పట్టాలెక్కనున్న రైళ్ళు..! రీజన్ ఇదే

Read this: ఆదాయమార్గాలపై సీఎం నజర్.. అందుకే ఆయన నియామకం

Read this: చెల్లని విరాళంతో ప్రచార ఆర్భాటం.. రేవంత్‌పై టీఆర్ఎస్ ధ్వజం

Read this: మత్స్యకారులకు మహర్దశ.. సీఎం ప్లాన్ లీక్ చేసిన మంత్రి

Read this: లాక్ డౌన్ తర్వాత మోడీ యాక్షన్ ప్లాన్

Read this: Breaking మరిన్ని ఆంక్షల సడలింపు