ఢిల్లీలో జీ-20 సమావేశాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జీ-20 సదస్సు ఏర్పాట్లను కేంద్రమంత్రులు, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సెప్టెంబర్ 9,10వ తేదీల్లో జరిగే గ్రూప్ ఆఫ్ 20 సమావేశాలకు అగ్రదేశాల నేతలతోపాటు వేలాది మంది హాజరుకానున్నారు. వసుధైక కుటుంబం సందేశంతో భారత్ ఈ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.
జీ-20 సమావేశాల కోసం.. దేశ రాజధాని ఢిల్లీ అందంగా ముస్తాబైంది. ఢిల్లీలోని కీలక భవనాలు, రోడ్లు విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. సమావేశాల సందర్భంగా కేంద్రం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. అన్ని చోట్ల భద్రతా బలగాలను మోహరించారు. డెలిగెట్స్ బస చేసే భవనాల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సుకు భద్రత నుంచి ఆహారం, అలంకరణ వరకు అన్నింటి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. విదేశీ అతిథులకు స్వాగతం పలికేందుకు ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లు పూర్తిగా సిద్ధమయ్యాయి. సాయంత్రం అయితే, చాలు అన్ని ప్రదేశాలు కూడా విద్యుత్ కాంతులతో కళకళలాడుతున్నాయి.
జీ-20 సదస్సు కారణంగా దేశ రాజధాని ఢిల్లీ సహా ఎన్‌సీఆర్ రూపురేఖలే మారిపోయాయి. రాజధానిని, ఎన్‌సీఆర్‌ను చాలా అందంగా అలంకరించారు. రోడ్డుపై ఉన్న కటౌట్ల నుంచి వివిధ కళాఖండాల వరకు.. అన్ని అందరికీ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఢిల్లీలోని వీధులన్నీ రాత్రిపూట మరింత అందంగా ఆకట్టుకుంటున్నాయి.
విదేశీ అతిథుల ఆతిథ్యం నేపథ్యంలో ఎలాంటి అవకాశాన్ని కూడా వదలకుండా ప్రతి విషయాన్ని ప్రత్యేకంగా తీర్చిదితుతున్నారు. జి-20 లో ఉన్న దేశాలు.. ఆయా జెండాలను, చిహ్నాలను కూడా ఏర్పాటు చేస్తూ.. ఢిల్లీని మరింత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.