
Baga Beach, Goa: బాగా బీచ్ గోవాలో అత్యంత ప్రసిద్ధి చెందిన, ప్రతి ఒక్కరూ ఇష్టపడే బీచ్‌లలో ఒకటి. ఉత్తర గోవాలో ఉన్న ఈ బీచ్ స్థానికులతో పాటుగా, పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ముఖ్యంగా రాత్రివేళ ఇక్కడి అందమైన ప్రకృతి దృశ్యం మాటల్లో చెప్పలేనిది. అందుకే మన దేశం నుండి మాత్రమే కాదు..విదేశీ పర్యాటకులు కూడా ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ లభించే సీఫుడ్ రెస్టారెంట్లు, పార్టీ కల్చర్ ఏడాది పొడవునా టూరిస్టులతో బిజీగా ఉండేలా చేస్తుంది.

Dharamshala: హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ధర్మశాల, టిబెటన్, భారతీయ సంస్కృతుల అందమైన మిశ్రమాన్ని అందిస్తుంది. సందర్శకులు సుగ్లాగ్‌ఖాంగ్ కాంప్లెక్స్‌ను సందర్శిస్తారు. త్రియుండ్‌కు ట్రెక్కింగ్ చేస్తారు. పట్టణంలోని ఆధ్యాత్మిక ప్రశాంతతను ఆస్వాదిస్తారు.

Gokarna Beach, Karnataka: దాని సహజ సౌందర్యం, ప్రశాంతమైన పరిసరాల కారణంగా కర్ణాటకలోని గోకర్ణ బీచ్ ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా మారింది. తీరప్రాంతంలో ఉన్న ఈ ప్రదేశం ప్రశాంతత, ప్రకృతిని ఎక్కువగా ఇష్టపడే ప్రయాణికులను ఆకర్షిస్తుంది. ఇక్కడ క్యాంపింగ్, బీచ్ ట్రెక్కింగ్, సూర్యాస్తమయం, సూర్యోదయ వీక్షణ ఎంతో అద్భుతంగా ఉంటుంది.

Manali: మనాలి హిమాచల్ ప్రదేశ్ లోని కులు లోయలో ఉన్న ఒక అందమైన కొండ ప్రాంతం. మంచుతో కప్పబడిన పర్వతాలు, దట్టమైన అడవులు, నదులతో చుట్టుముట్టబడిన మనాలి ట్రెక్కింగ్‌కి కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడకు వచ్చే సందర్శకులు ఎక్కువగా ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్, స్కీయింగ్, స్నోబోర్డింగ్‌లను ఆనందిస్తారు. చాలా మంది సోలాంగ్ వ్యాలీ, హడింబా ఆలయం, రోహ్‌తాంగ్ పాస్‌లను చూసేందుకు వస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన ప్రకృతి దృశ్యాలతో మనాలి ఏడాది పొడవునా ప్రయాణికులను ఆకర్షిస్తుంది.

Radhanagar Beach: అండమాన్, నికోబార్‌లోని రాధానగర్ బీచ్ దాని స్వచ్ఛమైన తెల్లని ఇసుక, నీలి జలాలకు ప్రసిద్ధి చెందింది. ఇది ఆసియాలోని అత్యుత్తమ బీచ్‌లలో ఒకటిగా చెబుతారు. పరిశుభ్రత, భద్రత పరంగా రాధానగర్ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను కూడా పొందింది. ప్రశాంతమైన వాతావరణం, అందమైన సూర్యాస్తమయాలు, సూర్యోదయాలు చూసేందుకు 2025లో ఇక్కడకు పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించింది.

Shimla: సిమ్లా, ఒక ప్రసిద్ధ హిల్ స్టేషన్. ఇక్కడ స్వచ్ఛమైన ప్రకృతి అందాలు, సహజ దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మీరు విక్టోరియన్ శైలి భవనాలు, పైన్ అడవుల దృశ్యాలను చూస్తూ చల్లని గాలిని ఆస్వాదించవచ్చు. మాల్ రోడ్, ది రిడ్జ్ లు సందర్శనా స్థలాలు, షాపింగ్ లకు ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు.