శుక్రవారం ఉదయం కారు ప్రమాదానికి గురైన భారత క్రికెటర్, ఢిల్లీ కాపిటల్స్ టీమ్ కెప్టెన్ రిషభ్ పంత్ త్వరలో జరగనున్న ఐపీఎల్ 2023 టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు కావడమే ఇందుకు కారణం. ఇంకా పంత్‌కు తగిలిన గాయం నయమవ్వడానికిక కనీసం మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టవచ్చని వైద్యులు కూడా తెలియజేయడంతో.. ఈ తరుణంలో అతని స్థానంలో ఢిల్లీ జట్టును నడిపించే సారథి ఎవరనే ప్రశ్నలు అందరిలోనూ ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. మరి రిషభ్ పంత్ బదులుగా ఢిల్లీని నడిపించేందుకు చర్చల్లో కొందరు ఆటగాళ్ల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం..
పంత్ స్థానంలో ఢిల్లీ కెప్టెన్సీ రేసులో డేవిడ్ వార్నర్ పేరు ముందంజలో ఉంది. డేవిడ్ వార్నర్ చాలా కాలం పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇంకా అతని కెప్టెన్సీలోనే హైదరాబాద్ టీమ్ ఐపీఎల్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది. అటువంటి పరిస్థితిలో ఢిల్లీ కెప్టెన్‌గా వార్నర్ మంచి ఎంపిక కావచ్చు.
ఒకవేళ భారత ఆటగాడినే ఢిల్లీ కెప్టెన్‌గా చేయాలని లేదా పంత్ లాంటి యువ ఆటగాడు కాపిటల్స్‌కు నాయకత్వం వహించాలని జట్టు ఫ్రాంచైజీ భావిస్తే, పృథ్వీ షా రేసులో ముందుకు సాగవచ్చు. అతను 2018 నుంచి ఈ టీమ్‌తోనే ఉన్నాడు. అతని ప్లస్ పాయింట్ ఏమిటంటే.. అతను భారత్ అండర్-19 ప్రపంచ కప్‌కు నాయకత్వం వహించాడు.
వీరిద్దరు కాకుండా మిచెల్ మార్ష్ ఢిల్లీకి కెప్టెన్‌గా ఉండగల మరో ఎంపిక. మార్ష్ ఆస్ట్రేలియాకు వైస్ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. కాబట్టి ఫ్రాంచైజీ మార్ష్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు.
వీరు కాకుండా మరో ఆటగాడి పేరు కూడా ఢిల్లీ పగ్గాలను అందుకునేందుకు పోటీదారుగా ఉన్నాడు. అతనే అక్షర్ పటేల్. ఢిల్లీ కోసం నిలకడగా రాణిస్తున్న పటేల్ పని తీరు ప్రస్తుత కోచింగ్ సిబ్బందికి బాగా తెలుసు. కాబట్టి అక్షర్ కూడా ఢిల్లీ జట్టుకు మంచి కెప్టెన్ కాగలడు.