
రాఖీ పండగ రోజున మార్కెట్‌లలో దొరికే రాఖీలను సోదరీమణులు వారి సోదరులకు కడతారు. తమకు రక్షగా ఉంటారనే నమ్మకంతో సోదరుల చేతులకు రాఖీలను కడతారు. అయితే ప్రకృతి ఒడిలో చెట్లకు విరబూసే రాఖీల గురించి చాలా తక్కువ మందికే తెలుసు. కొన్ని చోట్ల మాత్రమే కనిపించే ఈ పూలు.. అచ్చం రాఖీని పోలి ఉంటాయి. దీంతో ఈ పూలను రాఖీ పూలు అని పిలుస్తారు. రాఖీ పండుగ జరుపుకునే సమయంలోనే ఈ పూలు విరబూయడం విశేషం.

ఎక్కడో తెలుసా?: విశాఖలోని బయోడైవర్సిటీ పార్కులో విరబూసిన రాఖీ ఫ్లవర్ అందరినీ ఆకట్టుకుంటుంది. శ్రావణ మాసంలోనే ఈ పుష్పాలు విరబూస్తుంటాయి. రాఖీని పోలిన ఈ పుష్పాలు ప్రకృతి ప్రేమికులకు ఈ రాఖీ పండగ పూట తెగ నచ్చేస్తుంటాయి. ఈ సీజన్లో ప్రత్యేకంగా ఈ పూలను చూసేందుకు క్యూ కడుతుంటారు. ఈ పూలతో ఎంచక్కా ఫోటోలు తీసుకుంటూ.. ఈ పూల విశేషాలను తెలుసుకుంటున్నారు. కొంతమంది చేతికి పెట్టుకొని ప్రకృతి సృష్టించిన రాఖిని చూసి తెగ మురిసిపోతున్నారు. ఎందుకంటే ఇది తీగజాతి మొక్కకు పూసిన పుష్పం కావడంతో పువ్వుతో పాటు ఇరువైపులా తీగ కూడా చేతికి కట్టుకునేందుకు అనువుగా ఉంటుంది.

రాఖీ ఫ్లవర్.. దీన్నే కృష్ణ కమల్ అని కూడా అంటారు. శాస్త్రీయ నామం పాసీ ఫ్లోరా. దీన్నే ఫ్యాషన్ ఫ్లవర్.. రక్షాబంధన్ ఫ్లవర్.. ఫ్రెండ్‌షిప్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం విశాఖలోని మొక్క జాతుల విజ్ఞాన భాండాగరంగా పేరుపొందిన బయోడైవర్సిటీ పార్కులో ఈ పుష్పం విరబూసింది. రాణి చంద్రమదేవి ఆసుపత్రి ప్రాంగణంలో.. మూడు ఎకరాల విస్తీర్ణంలో ఈ బయోడైవర్సిటీ పార్క్ రూపుదిద్దుకుంది. రిటైర్డ్ ప్రొఫెసర్ రామమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించే జీవవైవిద్య ఉద్యానవనం ఎంతోమంది విద్యార్థులకు ఇక్కడి మొక్కలు విజ్ఞానాన్ని అందించాయి.

అన్నా చెల్లెలు అనుబంధానికి ప్రకృతిలో దొరికే ఈ పుష్పం ప్రతీక అని అంటున్నారు. ఈ మొక్క జాతుల్లో అయిదారు రకాలు ఉంటాయి. వాటిలో పింక్, వైట్, రెడ్, ఎల్లో రంగుల ఫ్లవర్స్ కూడా ఉంటాయి. కానీ నీలం రంగులో ఉండే ఆ పుష్పం ప్రత్యేకతే వేరు.

కృష్ణ కమలం.. మానసిక స్థితిని పెంచేదిగా పనిచేస్తుందని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. ఎందుకంటే అందులో ఉన్న కలర్ కాంబినేషన్ చూడగానే ఓ రకమైన ఆనందం.. ఆకర్షణ కలుగుతుందని చెబుతున్నారు. కృష్ణ కమల్ పువ్వులు ఆందోళన, ఒత్తిడిని తగ్గించడానికి, నిరాశ ప్రభావాలను తగ్గించడానికి ఉపయోగపడుతుందట. దీన్ని మూలికా సప్లిమెంట్‌గా వినియోగిస్తారని చెబుతున్నారు.