
ఉసిరికాయ పులిహోర తయారీలోకి వెళ్లితే.. అన్నం, నీళ్లు: 1.5 గ్లాసులు, నూనె: 2-3 టేబుల్ స్పూన్లు , ఉసిరికాయలు: 5-6 ,మిరియాలు: 1/2 టీ స్పూన్, ధనియాలు: 1 టీ స్పూన్, నువ్వులు: 1 టీ స్పూన్, పల్లీలు: 2 టేబుల్ స్పూన్లు, పచ్చి శనగపప్పు: 1 టీ స్పూన్, మినపప్పు: 1 టీ స్పూన్, ఆవాలు: 1/2 టీ స్పూన్, జీలకర్ర: 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు: 2-3,పచ్చిమిరపకాయలు: 4 , కరివేపాకు: కొద్దిగా, ఇంగువ: 1/4 టీ స్పూన్, పసుపు: 1/4 టీ స్పూన్, ఉప్పు: 1.5 టీ స్పూన్లు,నిమ్మరసం: 1/2 చెక్క, కొత్తిమీర: కొద్దిగా

తయారీలోకి వెళ్లితే.. ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని శుభ్రంగా కడిగి కుక్కర్‌లో తీసుకోండి. ఒకటిన్నర గ్లాసుల నీళ్లు, ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నూనె వేసి కలపండి. మూత పెట్టి హై ఫ్లేమ్‌లో రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి, స్టవ్ ఆపి గాలి పూర్తిగా పోయేవరకు అలాగే ఉంచండి. అన్నం పొడి పొడిగా రావడానికి ఉడికించిన తర్వాత కొద్దిసేపు ఆరనివ్వాలి. ఐదు లేదా ఆరు ఉసిరికాయలను కడిగి చాకుతో ముక్కలుగా కోసుకోండి. వీటిని మిక్సీ గిన్నెలో వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేయండి. ఇలా చేయడం వల్ల పులిహోరలో ఉసిరికాయ ముక్కలు తగులుతూ రుచిగా ఉంటాయి.

ఒక చిన్న మిక్సీ గిన్నెలో 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ నువ్వులు వేసి మెత్తగా పొడి చేయండి. ఈ పొడిని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. నూనె వేడయ్యాక పల్లీలు వేసి దోరగా వేయించండి. పల్లీలు వేగాక పచ్చి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించండి.

పోపు చక్కగా వేగాక, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఆ తర్వాత ఇంగువ, పసుపు వేసి కలపండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయ తురుమును వేసి జస్ట్ అలా ఒకసారి కలపండి. దీన్ని ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. వెంటనే తయారుచేసిన మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక నిమిషం పాటు వేయించండి.

ఉడికించి ఆరబెట్టిన అన్నాన్ని ఈ పోపులోకి వేసి అంతా కలిసేలా బాగా కలపండి. స్టవ్ ఆఫ్ చేసి, అరచెక్క నిమ్మరసం పిండండి. నిమ్మరసం ఉసిరికాయలోని వగరుదనాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. చివరగా కొత్తిమీర ఆకు వేసి మరోసారి కలిపి సర్వ్ చేయండి.