
టాయిలెట్.. ఇంట్లో ప్రతిఒక్కరూ ఉపయోగించే ప్రదేశం. ఈ ప్రదేశం శరీర పరిశుభ్రతతో ముడిపడి ఉన్నందున బాత్రూం శుభ్రంగా ఉండాలని ప్రతిఒక్కరూ భావిస్తారు. శుభ్రమైన టాయిలెట్ ఆరోగ్యానికి కూడా మంచిది.

చాలా మంది తమ టాయిలెట్లను శుభ్రంగా, నీట్‌గా ఉంచుకోవడానికి ప్రతిరోజూ శుభ్రం చేసుంటారు. ఇది ఒక మంచి అలవాటు. కొంతమంది తమ టాయిలెట్లను శుభ్రం చేయడానికి రకరకాల రసాయనాలను ఉపయోగిస్తారు. ఈ రసాయనాలు ఆరోగ్యానికి హానికరమని మీకు తెలుసా?

ఈ రోజుల్లో చాలా మంది తమ టాయిలెట్లను శుభ్రం చేయడానికి మార్కెట్లో లభించే రకరకాల టాయిలెట్ క్లీనర్లను ఉపయోగిస్తున్నారు. కొందరు మరకలు, మురికిని తొలగించడానికి ఆమ్లాలను కూడా వాడుతున్నారు. ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ రసాయన ఆధారిత ఉత్పత్తులు మీ చర్మానికి హాని కలిగిస్తాయి. ఇంట్లోని చిన్నపిల్లలు ప్రమాదవశాత్తు టాయిలెట్ క్లీనర్ లేదా యాసిడ్ తాగితే, అది మరణానికి కూడా దారితీసే ప్రమాదం ఉంది. అందువల్ల, వీటికి ఎల్లప్పుడూ దూరంగా ఉంచాలి.

పిల్లలు, వృద్ధులు, ఇంట్లోని ఇతర సభ్యులు టాయిలెట్ లేదా బాత్రూమ్ క్లీనర్‌లను ముట్టుకోకుండా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఒకవేళ మీరు కూడా ఈ వస్తువులను ముట్టుకుంటే మీ చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలి. వీటి వినియోగం తర్వాత శరీరాన్ని క్షుణ్ణంగా శుభ్రం చేసుకోవాలి.