
తెలుగువారి ఇళ్లలో రోటి పచ్చళ్లకు ఉన్న ఆదరణే వేరు. మిక్సీలో తిప్పే పచ్చళ్ల కంటే రోట్లో కచ్చాపచ్చాగా దంచి చేసే పచ్చడిలోనే అసలైన పల్లెటూరి నాటు రుచి దొరుకుతుంది. అందులోనూ వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి, రోటి టమోటా పచ్చడితో తింటుంటే ప్రతీ ముద్దలో అమృతం లాంటి రుచి లభిస్తుంది.

అంతేకాదు రాత్రి మిగిలిన చద్ది అన్నం లో ఈ పచ్చడి కలుపుకుని తింటే ఆ తృప్తే వేరు. ఎంతో సులభంగా, తక్కువ సమయంలోనే ఈ రోటి పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఈ టమోటా రోటి పచ్చడి తయారీ కోసం ముందుగా బాండీలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడిచేసి, శుభ్రం చేసి సగానికి కోసిన 5 టమోటాలు వేయాలి.

అందులోనే గిల్లిన 10 పచ్చిమిరపకాయలు, ఒక పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి మూతపెట్టి సన్నటి మంటపై ఉడికించాలి. మధ్యమధ్యలో టమోటాలను తిరగేస్తూ రెండు వైపులా బాగా మగ్గనివ్వాలి. టమోటాలు మెత్తబడే సమయంలో నిమ్మకాయ సైజు కంటే తక్కువ చింతపండు వేసి మగ్గించి చల్లారనివ్వాలి.

ముందుగా రోట్లో వేయించిన పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, సరిపడా సాల్ట్, అర టీస్పూన్ జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి. అందులోనే మగ్గించిన చింతపండు వేసి మెత్తగా తొక్కలు లేకుండా దంచాలి. ఆ తర్వాత ఉడికించిన టమోటాలను వేసి జారకుండా మెల్లగా గుజ్జులా దంచుకోవాలి.

చివరగా పిడికెడు తాజా కొత్తిమీర వేసి కాసేపు దంచాలి. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను రెండు ముక్కలుగా చేసి రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచాలి. ఉల్లిపాయ ముక్కలు దంచడం వల్ల దానిలోని రసం పచ్చడిలోకి దిగి ప్రత్యేకమైన కమ్మదనాన్ని ఇస్తుంది. సిద్ధమైన ఈ పచ్చడిని వేడి వేడి అన్నం, చపాతీ లేదా చల్ది అన్నంలోకి నంజుకుని తింటే తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది.