
చాలామందికి తాలికలు ఉడికేటప్పుడు విరిగిపోవడం లేదా బెల్లం పాకం కలపగానే పాలు విరిగిపోవడం జరుగుతుంటుంది. సరైన కొలతలు, చిన్నపాటి చిట్కాలు పాటిస్తే ఎంతో రుచికరమైన పాల తాలికలను ఇంట్లోనే అద్భుతంగా చేసుకోవచ్చు. ఆ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు: ఒకటిన్నర కప్పు రాత్రంతా నానబెట్టిన బియ్యం, ఒక కప్పు బెల్లం, అర లీటర్ పాలు, రెండు టేబుల్ స్పూన్లు - నానబెట్టిన సగ్గుబియ్యం, ఒక టీస్పూన్ యాలకుల పొడి, మూడు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి.

తాలికల తయారీ: నానబెట్టిన బియ్యాన్ని వడకట్టి అరగంట ఆరనిచ్చి మిక్సీలో మెత్తగా పౌడర్ చేసి జల్లించాలి. గిన్నెలో రెండు చెంచాల బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి కరిగించాలి. స్టవ్ ఆపేసి అందులో ఒక కప్పు తడి బియ్యం పిండి వేసి బాగా కలపాలి. పిండిలో కొద్దిగా నీళ్లు చల్లుతూ సెమీ సాఫ్ట్‌గా ముద్దలా చేసుకోవాలి. ఈ పిండిని చిన్న ఉండలుగా చేసి చేతి వేళ్లతో పొడవాటి తాలికల్లా ఒత్తుకోవాలి. చివరగా గ్రేవీ చిక్కదనం కోసం రెండు చెంచాల పిండిని పక్కన ఉంచాలి. మరొక పాత్రలో ఒక కప్పు బెల్లం, పావు కప్పు నీళ్లు పోసి బెల్లం పూర్తిగా కరిగే వరకు మరిగించి చల్లారనివ్వాలి. ఈ పాకం పూర్తిగా చల్లారిన తర్వాతే వాడాలి.

పాల తాలికల వండే విధానం: పాన్‌లో అర లీటర్ పాలు, పావు లీటర్ నీళ్లు పోసి మరిగించాలి. పాలు మరుగుతున్నప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం వేసి సగం ఉడికే వరకు ఉంచాలి. ఆ తర్వాత తయారుచేసిన తాలికలను అందులో వేసి కలపకుండా మూతపెట్టి చిన్న మంటపై ఐదు నిమిషాలు ఉడికించాలి. తాలికలు ఉడికిన తర్వాత పక్కన ఉంచిన పిండిలో కొద్దిగా నీళ్లు కలిపి పాలలో పోయాలి. దీనివల్ల పాలు మంచి చిక్కదనానికి వస్తాయి.

తాలికలు పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేయాలి. ఇందులో యాలకుల పొడి, పూర్తిగా చల్లారిన బెల్లం పాకాన్ని జల్లెడతో వడకట్టి కలపాలి. బెల్లం పాకం చల్లగా ఉండటం వల్లే పాలు అస్సలు విరగవు. చివరగా చిన్న కడాయిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్‌మిస్‌లను దోరగా వేయించి తాలికల్లో కలపాలి. అంతే, ఎంతో ఘుమఘుమలాడే నోరూరించే పాల తాలికల పాయసం సిద్ధం! ఈ పవిత్రమైన నైవేద్యాన్ని గణనాథునికి సమర్పించి అందరితో పంచుకోండి.