
కరకరలాడే పూరీలు, జీడిపప్పు-కొబ్బరి-గసగసాల సువాసనలతో చిక్కగా మరిగిన పాలలో నాని నోట్లో వేస్తే కరిగిపోతుంటాయి. పిల్లలకు ఎంతో బలాన్ని ఇచ్చే ఈ ఆరోగ్యకరమైన తీపి వంటకాన్ని ఇంట్లోనే పర్‌ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో చూద్దాం.

పాల పూరి తయారీ కోసం ముందుగా ఒక బౌల్‌లో ఒక కప్పు గోధుమపిండి, చిటికెడు ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని బాగా గట్టిగా కలుపుకుని 30 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు, రెండు టీస్పూన్ల బియ్యప్పుపిండి వేసి పౌడర్ చేయాలి.

అందులోనే ఒక పిడికెడు జీడిపప్పు వేసి మెత్తగా పొడి చేయాలి. ఆపై అర కప్పు పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా పాలు పోసి వెన్నలా మెత్తగా రుబ్బుకోవాలి. మందపాటి పాత్రలో ఈ పేస్ట్, ఒక లీటరు చిక్కటి పాలు పోసి సన్నటి మంటపై 20 నిమిషాలు కలుపుతూ మరిగించాలి.

పాలు చిక్కబడ్డాక ముప్పావు కప్పు పంచదార, ఒక టీస్పూన్ యాలకుల పొడి వేసి మరో 5 నిమిషాలు మరిగించి చల్లారనివ్వాలి. నానిన గోధుమపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పల్చటి పూరీల్లా ఒత్తుకోవాలి. పూరీలు పొంగకుండా ఫోర్క్‌తో గాట్లు పెట్టాలి.

వేడి నూనెలో వేసి అప్పడాల్లా ఎర్రగా, క్రిస్పీగా వేయించి తీయాలి. చల్లారిన పూరీలను చల్లారిన పాల మిశ్రమంలో కేవలం 15 సెకన్లు ఉంచి ప్లేట్‌లోకి తీసుకోవాలి. పైన మరికొన్ని పాలు పోసి సర్వ్ చేస్తే నోరూరించే పాల పూరి సిద్ధమవుతుంది.