
కొందరు తింటున్నప్పటికీ.. మిగిలిన అన్నంలో పాలు, చిక్కటి పెరుగు వేసి తోడుపెడుతుంటారు. కానీ అలా చిక్కటి పెరుగుతో చేయడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది తప్ప చలువ చేయదు. అసలైన శాస్త్రీయ పద్ధతిలో శరీరానికి అమృతంలా పనిచేసే చల్ది అన్నాన్ని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

పెరుగు శరీరానికి వేడి చేస్తుందా? మజ్జిగ ఎందుకు చలువ చేస్తుంది? చాలామందికి తెలియని ఆసక్తికరమైన నిజం ఏమిటంటే.. చిక్కటి పెరుగు స్వభావరీత్యా శరీరంలో వేడిని పెంచుతుంది , కానీ పలుచని మజ్జిగ మాత్రం చలువ చేస్తుంది. చిక్కటి పెరుగు పేగుల్లోకి వెళ్లినప్పుడు అక్కడ ఉండే ఆమ్లాలతో కలిసి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

ఈ జీర్ణ ప్రక్రియలో అది లోపల మరింత పులిసిపోయి శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. అదే పెరుగును పలుచన చేసి మజ్జిగగా మార్చినప్పుడు బ్యాక్టీరియా విడివడి, పులిసే ముందే సులభంగా జీర్ణమైపోయి శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అందుకే చల్ది అన్నాన్ని చిక్కటి పెరుగుతో కాకుండా పలుచని మజ్జిగ నీళ్లతో తోడుపెట్టాలి.

చల్ది అన్నం తయారీ విధానం: బాగా మెత్తగా ఉడికించిన అన్నం తీసుకోవాలి. అన్నం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తోడుపెట్టాలి. వేడి అన్నంలో మజ్జిగ వేస్తే అది ఎక్కువగా పులిసిపోయి పులుపు ఎక్కుతుంది. గోరువెచ్చని అన్నంలో తగినన్ని నీళ్లు, కొద్దిగా పలుచని మజ్జిగ వేసి కలపాలి. ఇది గంజి లాంటి పలుచని టెక్స్చర్‌తో ఉండాలి.

ఇందులోనే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలను వేయాలి. రాత్రంతా అన్నంతో పాటు ఇవి నానడం వల్ల ఉల్లిపాయలోని ఘాటు తగ్గి తియ్యగా మారుతుంది. పచ్చిమిర్చి కూడా కమ్మటి రుచితో ఊరి అన్నంతో నంజుకోవడానికి అద్భుతంగా ఉంటుంది; వేరే ఆవకాయలు లేదా పొడుల అవసరమే ఉండదు.

వీలైతే మట్టి పాత్రలో పెట్టి మూతపెట్టి రాత్రంతా వదిలేయాలి. మరుసటి రోజు ఉదయానికల్లా ఇందులో కోట్ల కొద్దీ మంచి బ్యాక్టీరియా, విటమిన్ B12 వృద్ధి చెందుతాయి. మధుమేహం, రక్తపోటు, అసిడిటీ, గ్యాస్ సమస్యలతో బాధపడేవారికి ఇది దివ్యౌషధం. పెరుగుతున్న పిల్లలు, గర్భిణీ స్త్రీలకు ఇది అపారమైన బలాన్ని ఇస్తుంది. ఉష్ణమండల వాతావరణంలో నివసించే వారికి ఉదయాన్నే ఇది సర్వశ్రేష్ఠమైన బ్రేక్‌ఫాస్ట్!