
తయారీకి కావాల్సిన పదార్థాలు: నూనె, వేరుశెనగలు : 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి: 10-15, టమాటోలు: 250-300 గ్రాములు, చింతపండు: చిన్న నిమ్మకాయ సైజు అంత, ఉప్పు రుచికి సరిపడ, వెల్లుల్లి రెబ్బలు: 2 లేదా3, కరివేపాకు: 2 రెమ్మలు, కొత్తిమీర సన్నగా తరిగినది.

తయారీ విధానం : ముందుగా, స్టవ్ ఆన్ చేసి దాని మీద కడాయి పెట్టుకుని ఒకటి లేదా ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నూనె వేయండి. నూనె వేడెక్కాక, ఒక టేబుల్ స్పూన్ వేరుశెనగ లు వేసి దోరగా వేయించాలి. పల్లీలు కొద్దిగా వేగాక, కారానికి తగ్గట్టుగా 10 నుండి 15 పచ్చిమిర్చిని వేసి నూనెలో కొద్దిసేపు మగ్గించాలి. పచ్చళ్ళలో కారం ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటుందని గుర్తుంచుకోండి.

పచ్చిమిర్చి కొద్దిగా మగ్గిన తర్వాత, 250 నుండి 300 గ్రాముల టమాటోలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని కడాయిలో వేయాలి. అన్నిటినీ బాగా కలిపి, మూత పెట్టి, మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లో ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు, దాదాపు 5 నుండి 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. టమాటో పూర్తిగా డ్రై అయిపోకుండా, గుజ్జు ఉండాలి. టమాటోలు మగ్గిన తర్వాత స్టవ్ ఆపివేయండి. ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కడాయి నుండి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి.

పూర్తిగా చల్లారిన తర్వాత, మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు, రెండు రెమ్మల కరివేపాకు వేయండి. ఇప్పుడు మనం మగ్గించి పెట్టుకున్న టమాటోపచ్చిమిర్చి మిశ్రమం నుండి పచ్చిమిర్చిని మాత్రమే తీసి మిక్సీ జార్లో వేసుకుని ముందుగా కొద్దిగా బరకగా గ్రైండ్ చేయాలి.

ఆ తర్వాత, మిగిలిన టమాటో గుజ్జును కూడా జార్లో వేసి, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేయండి. రోలు ఉంటే రోట్లో దంచుకోవడం ఇంకా ఉత్తమం. చివరగా, రెండు మూడు టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి జస్ట్ ఒక పల్స్ ఇవ్వాలి. అంతే టేస్టీ టేస్టీ టమాటో పచ్చడి రెడీ.