
ఈ భూమిపై కోట్లాది జీవ రాశులు ఉన్నాయి.. వాటిలో కొన్ని ప్రకృతిని కాపాడడంతో కీలక పాత్ర పోషిస్తుంటాయి. అలాంటి వాటిలో పాములు కూడా ఒకటి. ప్రకృతిలో వీటి పాత్ర చాల ప్రత్యేమమనే చెప్పాలి. కానీ ఇవి కాటేస్తే ప్రాణాలు పోతాయని చెప్పి చాలా మంది వాటిని చూస్తేనే భయంతో వణికిపోతారు. కానీ అన్ని పాములు విషపూరితమైనవి కాదు.. కొన్ని మాత్రమే ప్రాణాలు తీసే విషాన్ని కలిగి ఉంటాయి. మరీ ప్రపంచలోనే అత్యంత విషపూరితమైన పాములు ఎక్కడున్నాయో తెలుసుకుందాం.

ఈ భూమిపై దాదాపు 4000కు పైగా పాము జాతులు ఉన్నాయి. అందులో కేవలం 600 రకాలు మాత్రమే విషపూరితమైనవి.. వీటిలో కూడా మళ్లీ మనుషుల ప్రాణాలు తీసేంత విషం కలిగిన పాములు కేవలం 200 రకాలే.. వీటిలో అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పాము సా స్కేల్డ్ వైపర్. ఇది ఎక్కువగా పశ్చిమాసియాలోని కొన్ని ప్రాంతాల్లో, ఆఫ్రికా దేశాల్లో కనిపిస్తుంది.

ఇక అమెజాన్ వర్షారణ్యాల కారణంగా బ్రెజిల్లో కూడా పాముల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ 420 రకాల జాతులు పాములు ఉన్నాయట. ఈ దేశంలో దాదాపు 30 రకాల విషపూరిత పాములు కనిపిస్తాయి. అంతేకాదు ప్రపంచంలో అత్యంత పొడవైన పాముల్లో రెండవదైన అనకొండలు కూడా ఇక్కడే ఉంటాయట.

ఇక మన దేశంలో కూడా పాముల సంఖ్య ఎక్కువే.. మన దేశంలో 305 రకాల పాము జాతులు ఉన్నాయట. ఇంకా కొన్ని సర్పజాతులను గుర్తించాల్సి ఉందట. పశ్చిమ కనుమల్లో 2020లో మట్టి పామును, హిమాలయాల్లో 2021లో కుక్రి స్నేక్‌ను గుర్తించారు. బూడిద రంగులో కనిపించే కీల్ బ్యాక్ రకాలు, నాగుపాములు, సా స్కేల్డ్ వైపర్లు వంటి అనేక విషపూరిత సర్పాలు భారతదేశంలో విస్తరించి ఉన్నాయి.

ప్రపంచంలో పాము జాతులు అధికంగా ఉన్న దేశాలతో పాటు, అసలు పాములే లేని దేశాలు కూడా ఉన్నాయి. న్యూజిలాండ్, ఐర్లాండ్, ఐస్లాండ్, గ్రీన్ ల్యాండ్, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి ద్వీపంలో అసలు పాములే ఉండవట. పాముల పట్ల ప్రజల్లో ఇంకా అపోహలు, భయాలు ఉన్నప్పటికీ, వివిధ సంస్థలు, ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా అవగాహన పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడ్డారు.