
అందరికీ పెరుగు సరిపడదా: పెరుగులో ప్రోబయోటిక్స్, కాల్షియం, ప్రోటీన్ వంటి అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుందనేది వాస్తవమే అయినా శరీర తత్వాలను బట్టి ఫలితాలు మారుతుంటాయి. చాలా మంది ఫ్రిజ్ నుండి తీసిన వెంటనే చల్లచల్లని పెరుగును ఆరగిస్తారు. ఇది జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రాత్రి వేళల్లో పెరుగు తీసుకోవడం వల్ల జలుబు, గొంతు సంబంధిత సమస్యలు లేదా అజీర్ణం వచ్చే అవకాశం ఉంది. పెరుగు తిన్న తర్వాత మొటిమలు లేదా దద్దుర్లు వస్తుంటే మీ శరీరానికి పెరుగు పడటం లేదని అర్థం.

ఆయుర్వేదం ఏం చెబుతోంది?: ఆయుర్వేద శాస్త్రం ప్రకారం పెరుగును బరువైన ఆహారంగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు చిక్కటి పెరుగును నేరుగా తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరగడం, అలసట లేదా వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అందుకే అనాది కాలం నుండి మన పెద్దలు పెరుగును నేరుగా తినడం కంటే మజ్జిగ రూపంలో తీసుకోవాలని సూచించేవారు.

మజ్జిగకు ప్రాధాన్యత ఇవ్వండి: రుగులో తగినన్ని నీళ్లు పోసి బాగా చిలకాలి. అందులో చిటికెడు ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి కలపాలి. ఇలా చేయడం వల్ల మజ్జిగ తేలికగా మారి, త్వరగా జీర్ణమవుతుంది. ఇది శరీరానికి అసలైన చల్లదనాన్ని ఇస్తుంది. ఫ్రిజ్ లోని చల్లటి పెరుగును నేరుగా తినకుండా, కనీసం అరగంట ముందే బయట ఉంచి అది సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చాకే ఉపయోగించాలి. తీపి లస్సీ ఇష్టపడే వారు చక్కెర మోతాదును తగ్గించాలి. అతిగా తీపి ఉండే లస్సీ బరువు పెరగడానికి, నిద్రకు ఆటంకం కలిగించడానికి కారణమవుతుంది.

ఎవరు జాగ్రత్తగా ఉండాలి? : తరచుగా గ్యాస్, ఎసిడిటీ లేదా కడుపు ఉబ్బరంతో బాధపడేవారు చిక్కటి పెరుగుకు దూరంగా ఉండి, పల్చని మజ్జిగను ఎంచుకోవాలి. చర్మ అలెర్జీలు లేదా దురద ఉన్నవారు పెరుగు మోతాదు తగ్గించి వైద్యుడిని సంప్రదించాలి. షుగర్ లేని లేదా తక్కువ కొవ్వు ఉన్న పెరుగును మాత్రమే తీసుకోవడం ఉత్తమం.

పల్లెటూరి పద్ధతే మేలు: మధ్యాహ్న భోజనంతో పాటు జీలకర్ర మజ్జిగను సేవించే సంప్రదాయం ఇప్పటికీ మన పల్లెల్లో కనిపిస్తుంది. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు, డీహైడ్రేషన్ నుండి మనల్ని కాపాడే గొప్ప వైద్యం. కాబట్టి, పెరుగును అమృతంలా మార్చుకోవాలా లేదా సమస్యగా మార్చుకోవాలా అనేది మనం తీసుకునే పద్ధతిపైనే ఆధారపడి ఉంటుంది.