
ఉదయం నిద్రలేవగానే అద్దంలో చూసుకున్నప్పుడు రాలిన జుట్టును చూసి ఆందోళన చెందని పురుషుడు ఈ రోజుల్లో అరుదు. జుట్టు పలచబడటం, నుదురు వెనక్కి వెళ్లడం వంటివి కేవలం సౌందర్య సమస్యలు మాత్రమే కాదు, అవి మీ శరీర అంతర్గత అనారోగ్యానికి సంకేతాలని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా 1.6 లక్షల మంది భారతీయ పురుషులపై జరిపిన ఒక భారీ సర్వేలో, జుట్టు రాలడానికి మలబద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలే ప్రధాన కారణమని తేలింది.

మన జుట్టు ప్రధానంగా కెరాటిన్ అనే ప్రోటీన్‌తో తయారవుతుంది. మనం తీసుకునే ఆహారంలోని ప్రోటీన్లు, ఐరన్, విటమిన్లు జుట్టు కుదుళ్లకు చేరాలంటే, ముందుగా అవి మన పేగుల్లో సరిగ్గా శోషించబడాలి. జీర్ణక్రియ సరిగ్గా లేనప్పుడు లేదా మలబద్ధకం ఉన్నప్పుడు, శరీరం పోషకాలను గ్రహించలేదు. ఫలితంగా జుట్టుకు అందాల్సిన ఆహారం అందక అవి బలహీనపడి రాలిపోతాయి. పేగు సంబంధిత సమస్యలు శరీరంలో అంతర్గత మంటను పెంచుతాయి, ఇది జుట్టు కుదుళ్లను దెబ్బతీస్తుంది.

2024–2025 కాలంలో భారతీయ పురుషుల జీర్ణ ఆరోగ్యం గణనీయంగా క్షీణించినట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. జీర్ణ సంబంధిత రుగ్మతలు అత్యధికంగా పెరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. దీని తర్వాత రాజస్థాన్, ఢిల్లీ ఎన్‌సిఆర్, మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి. ఐటీ, కార్పొరేట్ రంగాల్లో పనిచేసే యువతలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. 10-నిమిషాల డెలివరీ యాప్‌ల ద్వారా వచ్చే జంక్ ఫుడ్, సమయానికి భోజనం చేయకపోవడం వంటి అలవాట్లు పేగుల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి.

బాగా చదువుకుని, నగరాల్లో నివసించే పురుషులలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. పని ఒత్తిడి వల్ల నిద్రలేమి, అధికంగా టీ, కాఫీలు సేవించడం వల్ల ఒత్తడి సమస్యలు వస్తున్నాయి. ఫైబర్ లేని ఆహారం తీసుకోవడం వల్ల మలబద్ధకం ఏర్పడుతున్నాయి. కేవలం నూనెలు, షాంపూలు మారిస్తే జుట్టు పెరుగుతుందని అనుకోవడం ఒక అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.

జుట్టు రాలడం అనేది ఒక వ్యాధి కాదు, అది మీ లోపల ఏదో లోపం ఉందని చెప్పే ఒక లక్షణం మాత్రమే. పెరుగు వంటి సహజ సిద్ధమైన ప్రోబయోటిక్స్ తీసుకోవడం ద్వారా పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి. వేళకు భోజనం, సరిపడా నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. కేవలం జుట్టుకు చికిత్స చేయించుకునే ముందు మీ జీర్ణక్రియ, హార్మోన్లు, ఒత్తిడి స్థాయిలను పరీక్షించుకోవడం ఉత్తమం.